Warner vs Jadeja: బుట్టబొమ్మ vs పుష్ప.. వార్నర్-జడేజా మధ్య ఆసక్తికర సంఘటన.. వీడియో వైరల్
20 May 2023, 22:09 IST
- Warner vs Jadeja: దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, సీఎస్‌కే ప్లేయర్ రవీంద్ర జడేజా మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. బ్యాట్ త్రో వేసే సమయంలో వార్నర్.. జడ్డూను అనుకరిస్తూ బ్యాట్‌ను కత్తి మాదిరిగా గాల్లోకి తిప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
వార్నర్-జడేజా మధ్య ఫన్నీ సంఘటన
Warner vs Jadeja: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 77 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఫలితంగా ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. 224 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దిల్లీ 149 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్ధశతకంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా, దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మధ్య సరదా సన్నివేశం జరిగింది.
చెన్నై బౌలర్ దీపక్ చాహర్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని వార్నర్ కవర్స్ దిశగా ఆడాడు. అక్కడ రిస్క్ ఉన్నప్పటికీ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. మొయిన్ అలీ త్రో వేయగా దాన్ని రహానే అందుకున్నాడు. ఇంతలో వార్నర్ మరో పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. మరో ఎండ్‌లో జడేజా బంతి తనకు వేయమనడంతో రహానే ఆ బాల్‌ను జడ్డూ వైపు విసిరాడు. అయితే ఆ లోపే వార్నర్ క్రీజులోకి వెళ్లిపోతాడు.
సరిగ్గా ఇదే సమయంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంతి అందుకున్న జడ్డు త్రో వేయకుండా వేస్తానని వార్నర్‌ను బెదిరిస్తాడు. వార్నర్ కూడా ఏమాత్రం తగ్గకుండా నాకే భయం లేదన్నట్లుగా క్రీజు దాటతాడు. అంతటితో ఆగకుండా జడ్డూ వైపు చూస్తూ అతడి మాదిరిగానే బ్యాట్‌ను గాల్లో కత్తిలా తిప్పుతాడు. మరో వైపు జడ్డూ కూడా అలాగే చూస్తుండటంతో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో దిల్లీపై చెన్నై 77 పరుగుల తేడాతో గెలిచింది. . 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 9 వికెట్లు నష్టపోయి 149 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(89) అర్ధశతకంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడికి సరైన సహకారం లభించకపోవడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ, మహీష ప్రతిరాణ చెరో 2 వికెట్లతో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు భారీ లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్ ముందు నిర్దేశించింది. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.