Arshdeep Singh: ఓ చెత్త వరల్డ్ రికార్డు మూటగట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్.. ఏంటో తెలుసా?
04 May 2023, 15:02 IST
- Arshdeep Singh: ఓ చెత్త వరల్డ్ రికార్డు మూటగట్టుకున్నాడు అర్ష్‌దీప్ సింగ్. ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఈ ఊహించని రికార్డు క్రియేట్ చేశాడు.
అర్ష్‌దీప్ సింగ్
Arshdeep Singh: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటర్ల ధాటికి అర్ష్‌దీప్ బలయ్యాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో మూడో అత్యధిక స్కోరును చేజ్ చేసిన విషయం తెలిసిందే. 215 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేయడం విశేషం.
అయితే ఈ మ్యాచ్ లో అర్ష్‌దీప్.. టీ20 క్రికెట్ లో ఓ చెత్త వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. ఈ ఫార్మాట్ లో పూర్తి 4 ఓవర్ల కోటా ముగించకుండానే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా అతడు నిలిచాడు. అర్ష్‌దీప్ 3.5 ఓవర్లలోనే ఏకంగా 66 పరుగులు ఇవ్వడం గమనార్హం. ఈ ఐపీఎల్ కంటే ముందు అతడు ఒక్కసారి కూడా తన 4 ఓవర్ల కోటాలో 50 పరుగులకు మించి ఇవ్వలేదు.
కానీ ఈ మ్యాచ్ లో మాత్రం సూర్యకుమార్ లాంటి ఎంఐ బ్యాటర్ల ధాటికి ధారాళంగా రన్స్ ఇచ్చేశాడు. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొత్తం 430 రన్స్ నమోదయ్యాయి. అందరు బౌలర్లూ భారీగా పరుగులు ఇచ్చినా.. అర్ష్‌దీప్ మాత్రం వాళ్లందరినీ మించిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ బౌలర్ కూడా ఇలాంటి రికార్డును మూటగట్టుకోలేదు.
అర్ష్‌దీప్ తర్వాత బెన్ వీలర్ 3.1 ఓవర్లలో 64 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇక టామ్ కరన్, పాట్ బ్రౌన్, అలెక్స్ డిజిగా తమ 4 ఓవర్ల కోటా పూర్తి చేయకుండానే 63 పరుగులు ఇచ్చారు. ఇక ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న బౌలర్లను కూడా లెక్కలోకి తీసుకుంటే.. ఈ లిస్టులో అర్ష్‌దీప్ స్థానం ఐదు. ఐపీఎల్లో బేసిల్ థంపి 4 ఓవర్లలోనే 70 పరుగులు ఇచ్చాడు.
2018లో సన్ రైజర్స్ తరఫున ఆర్సీబీతో మ్యాచ్ లో థంపి ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇక యశ్ దయాల్ ఈ సీజన్ లోనే 4 ఓవర్లలో 69 రన్స్ ఇచ్చాడు. ఆ మ్యాచ్ చివరి ఓవర్ వేసిన యశ్ దయాల్ బౌలింగ్ లోనే రింకు సింగ్ ఐదు సిక్స్ లు బాదాడు.