తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Australia: ఆస్ట్రేలియాకు మళ్లీ నిరాశే.. వరుసగా నాలుగో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన ఇండియా

India vs Australia: ఆస్ట్రేలియాకు మళ్లీ నిరాశే.. వరుసగా నాలుగో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన ఇండియా

Hari Prasad S HT Telugu

13 March 2023, 16:28 IST

google News
    • India vs Australia: ఆస్ట్రేలియాకు మళ్లీ నిరాశే ఎదురైంది. వరుసగా నాలుగో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది ఇండియా. సోమవారం (మార్చి 13) చివరిదైన నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇండియా 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియా, ఇండియా జట్ల కెప్టెన్లు స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా, ఇండియా జట్ల కెప్టెన్లు స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ (PTI)

ఆస్ట్రేలియా, ఇండియా జట్ల కెప్టెన్లు స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ

India vs Australia: ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా వెళ్లినా.. ఆ టీమ్ ఇక్కడికి వచ్చినా ఫలితంలో మాత్రం మార్పు రావడం లేదు. వరుసగా నాలుగో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా గెలవడం విశేషం. సోమవారం (మార్చి 13) ముగిసిన తాజా సిరీస్ ను ఇండియా 2-1తో దక్కించుకుంది. అహ్మదాబాద్ లో జరిగిన చివరిదైన నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో సిరీస్ ఇండియా వశమైంది.

తొలి రెండు టెస్టులు గెలిచిన ఇండియా సిరీస్ లో తిరుగులేని ఆధిక్యం సంపాదించగా.. మూడో టెస్ట్ ఆస్ట్రేలియా గెలిచి ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. నాలుగో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులతో దీటుగానే మొదలుపెట్టినా.. ఇండియా కూడా కోహ్లి సెంచరీతో మరింత దీటుగా స్పందించి 91 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 2 వికెట్లకు 175 పరుగులు చేసిన సందర్భంలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

ఆ సమయానికి లబుషేన్ 63, స్మిత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. మ్యాచ్ ఫలితం తేలేలా కనిపించకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు, అంపైర్లు మ్యాచ్ ను అక్కడితో ముగించాలని నిర్ణయించారు. అప్పటికి ఆస్ట్రేలియా 84 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ చేతుల్లో శ్రీలంక ఓడిపోవడంతో ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరింది.

ఆస్ట్రేలియాపై 2017 నుంచి ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటూ వస్తోంది. 2017, 2018-19, 2020-21, 2023లలో వరుసగా నాలుగుసార్లు ఈ ట్రోఫీని ఇండియా గెలుచుకుంది. అందులో రెండు ఆస్ట్రేలియా గడ్డపై కావడం విశేషం. తాజా సిరీస్ లో నాగ్‌పూర్, ఢిల్లీలలో జరిగిన తొలి రెండు మ్యాచ్ లలో కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా ఓడిపోవడంతో సిరీస్ పై ఆశలు కోల్పోయింది.

ఆ తర్వాత కమిన్స్ వెళ్లిపోవడంతో స్టాండిన్ కెప్టెన్ స్మిత్ కెప్టెన్సీలో మూడో టెస్టులో అనూహ్యంగా పుంజుకొని విజయం సాధించింది. ఇక చివరి టెస్ట్ లోనూ పోరాడి డ్రాగా ముగించగలిగింది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా.. అశ్విన్, జడేజాలకు సంయుక్తంగా మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కడం విశేషం.

తదుపరి వ్యాసం