తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wi Vs Ind: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాను ఊరిస్తున్న రెండు వరల్డ్‌ రికార్డులు

WI vs Ind: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాను ఊరిస్తున్న రెండు వరల్డ్‌ రికార్డులు

Hari Prasad S HT Telugu

22 July 2022, 8:25 IST

google News
    • WI vs Ind: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆడుతున్న టీమిండియాను రెండు వరల్డ్‌ రికార్డులు ఊరిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.
వన్డే సిరీస్ ట్రోఫీతో శిఖర్ ధావన్, నికొలస్ పూరన్
వన్డే సిరీస్ ట్రోఫీతో శిఖర్ ధావన్, నికొలస్ పూరన్ (AFP)

వన్డే సిరీస్ ట్రోఫీతో శిఖర్ ధావన్, నికొలస్ పూరన్

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: సీనియర్లు లేకపోయినా శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని యంగిండియా విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మధ్యే ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లలో ఓడించిన కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతున్న ఇండియన్‌ టీమ్‌.. ఇప్పుడు వెస్టిండీస్‌ పని పట్టడానికి సిద్ధమైంది. అయితే ఈ సిరీస్‌లో రెండు వరల్డ్‌ రికార్డులు ఇండియన్‌ టీమ్‌ను ఊరిస్తున్నాయి.

2007 నుంచి 2022 వరకూ వెస్టిండీస్‌పై వరుసగా 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలిచింది టీమిండియా. ఇది ప్రస్తుతం పాకిస్థాన్‌తో కలిసి సంయుక్త వరల్డ్‌ రికార్డు. అటు పాక్‌ కూడా జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌లు గెలిచింది. ఒకవేళ ఇప్పుడు వెస్టిండీస్‌పై సిరీస్‌ గెలిస్తే 12 వరుస సిరీస్‌ విజయాలతో వరల్డ్‌ రికార్డు ఇండియన్‌ టీమ్‌ సొంతమవుతుంది. వెస్టిండీస్‌తో చివరిసారి 2006లో వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడింది.

వెస్టిండీస్‌లోనూ ఆధిపత్యం

ఒకప్పుడు వెస్టిండీస్‌ టూర్‌ అంటే ఇండియన్‌ టీమ్‌ వెన్నులో వణుకు పుట్టేది. అక్కడి పిచ్‌లపై విండీస్‌ పేస్‌ బౌలర్లను ఎదుర్కోవడం సవాలుగా ఉండేది. 80లు, 90ల్లోని విండీస్‌ టీమ్‌ చాలా స్ట్రాంగా ఉండటంతో ఇండియన్‌ టీమ్‌ అక్కడికి వెళ్లినప్పుడల్లా ఇబ్బంది పడేది. అయితే 2000 తర్వాత పరిస్థితి మారింది. అక్కడ ఆడిన 27 మ్యాచ్‌లలో ఇండియా 14 గెలిచింది.

మొత్తంగా కూడా వెస్టిండీస్‌పై 136 మ్యాచ్‌లు ఆడిన ఇండియా.. 67 మ్యాచ్‌లలో విజయాలతో ఆ టీమ్‌పై పైచేయి సాధించింది. ఇక తొలి వన్డే జరగబోయే పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోనూ ఇండియా రికార్డు చాలా బాగుంది. ఈ గ్రౌండ్‌లో ఇండియా విజయాలు/పరాజయాల రేషియో 4.5గా ఉంది. విదేశీ గడ్డపై అత్యుత్తమ రేషియో ఉన్న గ్రౌండ్‌లలో ఈ పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌తోపాటు జింబాబ్వేలోని హరారే కూడా ఉంది.

ఒకవేళ శుక్రవారం జరగబోయే తొలి వన్డేలో వెస్టిండీస్‌ను ఓడిస్తే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌ ఈ విజయాలు/పరాజయాల రేషియో 5కు చేరుతుంది. అదే జరిగితే 2007 తర్వాత విదేశీ గడ్డపై ఓ టీమ్‌ సాధించిన అత్యుత్తమ విజయాలు/పరాజయాల రేషియో అవుతుంది. 2007 నుంచి ఈ పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఇండియా ఆడిన మ్యాచ్‌లలో కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఓడింది. 2007 వరల్డ్‌కప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత ఇక్కడ ఆడిన ప్రతి మ్యాచ్‌ గెలిచింది.

వెస్టిండీస్‌ చెత్త రికార్డు

ఇక ఈ గ్రౌండ్‌లో వెస్టిండీస్‌కు మాత్రం చెత్త రికార్డు ఉంది. గత 14 ఏళ్లుగా ఈ గ్రౌండ్‌లో ఆ టీమ్‌ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. 2008లో చివరిసారి శ్రీలంకపై గెలిచిన తర్వాత ఇప్పటి వరకూ మరో మ్యాచ్‌లో గెలవలేదు. 2019లో చివరిసారి ఇండియా, వెస్టిండీస్‌ మధ్యే ఇక్కడ వన్డే మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మరో వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది.

తదుపరి వ్యాసం