WI vs IND: అరుదైన ఘనతకు అడుగు దూరంలో ధావన్.. రోహిత్, ధోనీ రికార్డుకు అవకాశం
21 July 2022, 19:27 IST
- వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియాకు కెప్టెన్‌గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. అయితే ధావన్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు.
శిఖర్ ధావన్
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రినిడాడ్ చేరుకున్న టీమిండియాకు ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జులై 22 శుక్రవారం నాడు ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. అయితే ఈ వన్డే సిరీస్‌లో ధావన్ అరుదైన ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్ గడ్డపై అత్యధిక మ్యాచ్‌ల్లో వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన భారత క్రికెటర్‌గా గబ్బర్ రికార్డు సృష్టించే అవకాశముంది. ఫుల్ టైం కెప్టెన్ రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్‌కు పగ్గాలు అప్పిగించారు.
వెస్టిండీస్‌లో శిఖర్ ధావన్ మొత్తం 14 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ 15 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. జులై 22 నుంచి జరగనున్న మూడు వన్డేల్లో ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండటంతో కోహ్లీని అధిగమించే అవకాశముంది. కరేబియన్ గడ్డపై ధావన్ నేతృత్వం వహించిన 14 మ్యాచ్‌ల్లో అతడు 26.76 సగటుతో 348 పరుగులు మాత్రమే చేసాడు. విండీస్ గడ్డైపై అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లలో గబ్బర్ ఐదో స్థానంలో నిలిచాడు.
మరోపక్క విరాట్ కోహ్లీ అతడు నేతృత్వం వహించిన 15 మ్యాచ్‌ల్లో 70 సగటుతో 790 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇందులో 4 శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం కరేబియన్లతో జరగనున్న మూడు వన్డేలో ధావన్ సత్తా చాటినట్లయితే రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీని అధిగమించి రెండో స్థానానికి చేరుకుంటాడు.
వెస్టిండీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు..
1. విరాట్ కోహ్లీ- 15 మ్యాచ్‌ల్లో 790 పరుగులు
2. ఎంఎస్ ధోనీ- 15 మ్యాచ్‌ల్లో 458 పరుగులు
3. యువరాజ్ సింగ్- 14 మ్యాచ్‌ల్లో 419 పరుగులు
4. రోహిత్ శర్మ- 14 మ్యాచ్‌ల్లో 408 పరుగులు
5. శిఖర్ ధావన్- 14 మ్యాచ్‌ల్లో 348 పరుగులు
స్వదేశంలో వెస్టిండీస్‌పై ధావన్‌కు మంచి రికార్డు ఉంది. అతడు రెండు శతకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది జట్టు మేనేజ్మెంట్. రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వీరు ముగ్గురిలో ఒకరు ధావన్‌తో పాటు ఓపెనింగ్ చేసే అవకాశముంది. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్‌లో బాధ్యతలను తీసుకోనున్నారు.
చాలా రోజుల తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న శిఖర్ ధావన్.. విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి అతడు కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. రెండింటిలో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. దీంతో వన్డేలో అతడి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. విండీస్‌తో జరగనున్న సిరీస్‌లో సత్తా చాటితేనే అతడికి మున్ముందు అవకాశాలు రావు.