తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India And Pakistan Fined: ఇండియా, పాకిస్థాన్‌ టీమ్స్‌కు భారీ జరిమానా

India and Pakistan Fined: ఇండియా, పాకిస్థాన్‌ టీమ్స్‌కు భారీ జరిమానా

Hari Prasad S HT Telugu

31 August 2022, 18:02 IST

google News
    • India and Pakistan Fined: ఇండియా, పాకిస్థాన్‌ టీమ్స్‌కు భారీ జరిమానా విధించారు. ఆసియా కప్‌లో భాగంగా ఈ రెండు టీమ్స్‌ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తలపడిన విషయం తెలిసిందే.
స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియా, పాకిస్థాన్ జట్లకు భారీ జరిమానా
స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియా, పాకిస్థాన్ జట్లకు భారీ జరిమానా (ANI)

స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియా, పాకిస్థాన్ జట్లకు భారీ జరిమానా

India and Pakistan Fined: ఆసియా కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రెండు టీమ్స్‌కు భారీ జరిమానా విధించారు. వాళ్ల మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోత విధించారు. గ్రూప్‌ ఎలో భాగంగా గత ఆదివారం (ఆగస్ట్‌ 28) ఈ రెండు టీమ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.

రెండు జట్ల కెప్టెన్లు తమ నిర్ణీత సమయాల్లో రెండేసి ఓవర్లు తక్కువగా వేసినట్లు గుర్తించారు. దీంతో ఐసీసీ మ్యాచ్‌ రిఫరీల ఎలైట్‌ ప్యానెల్‌కు చెందిన జెఫ్‌ క్రోవ్‌ ఈ జరిమానా విధించారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో తక్కువగా వేసే ఒక్కో ఓవర్‌కు 20 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తారు. ఇక్కడ రెండేసి ఓవర్లు తక్కువ కావడంతో రెండు టీమ్స్‌కు 40 శాతం కోత పెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

రెండు జట్ల కెప్టెన్లు తమ తప్పును అంగీకరించారని తెలిపింది. మ్యాచ్‌లోని ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లతోపాటు థర్డ్‌, ఫోర్త్‌ అంపైర్లు కూడా రెండు టీమ్స్‌ స్లో ఓవర్‌ రేట్‌ పొరపాటు చేసినట్లు ఐసీసీకి నివేదించారు. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్లతో గెలిచిన విషయం తెలిసిందే. నిజానికి ఈ స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా మ్యాచ్‌ సమయంలోనే పాకిస్థాన్‌ శిక్ష అనుభవించింది.

ఆ టీమ్‌ 18వ ఓవర్‌ నుంచి 30 గజాల సర్కిల్‌ బయట ఒక ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా ఇండియాకు కలిసి వచ్చింది. ఆ ఓవర్లో జడేజా ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టగా.. తర్వాతి ఓవర్లో హార్దిక్‌ పాండ్యా మూడు ఫోర్లు బాదాడు. ఇక చివరి ఓవర్‌ 4వ బంతికి సిక్స్‌ కొట్టి హార్దిక్‌ మ్యాచ్‌ను ఘనంగా ముగించాడు. 2022, జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్‌ ప్రకారం.. నిర్ణీత సమయంలో చివరి ఓవర్‌ ప్రారంభించలేకపోతే సదరు టీమ్‌కు ఇలా ఒక ఫీల్డర్‌ను 30 గజాల బయట ఉంచే అవకాశం ఇవ్వరు.

తదుపరి వ్యాసం