IND vs WI Schedule: వెస్టిండీస్‌లో ఇండియా టూర్ పూర్తి షెడ్యూల్ ఇదే
12 June 2023, 21:02 IST
- IND vs WI Schedule: వెస్టిండీస్‌లో ఇండియా టూర్ పూర్తి షెడ్యూల్ ఇదే. ఈ షెడ్యూల్ ను బీసీసీఐ సోమవారం (జూన్ 12) తమ ట్విటర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది.
వచ్చే నెలలో వెస్టిండీస్ వెళ్లనున్న టీమిండియా
IND vs WI Schedule: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత టీమిండియా మరో పర్యటనకు సిద్ధమవుతోంది. ఈసారి టెస్ట్, వన్డే, టీ20 పూర్తి స్థాయి టూర్ కోసం వెస్టిండీస్ వెళ్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను సోమవారం (జూన్ 12) బీసీసీఐ తమ ట్విటర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ కోసం తొలి రెండు టెస్టులు వెస్టిండీస్ లోనే ఇండియా ఆడనుంది.
జులైలో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఆగస్టులో ముగుస్తుంది. ఈ టూర్ లో భాగంగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా తొలి టెస్టును ఇండియన్ టీమ్ వెస్టిండీస్ తో జులై 12 నుంచి 16 వరకు డొమినికాలోని విండ్సర్ పార్క్ లో ఆడుతుంది.
ఇక రెండో టెస్టు జులై 20 నుంచి 24 వరకు ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో ఆడనుంది. ఈ రెండో టెస్టు ఇండియా, వెస్టిండీస్ మధ్య 100వ టెస్ట్ కావడం విశేషం. ఈ రెండు క్రికెట్ దేశాల మధ్య జరగబోయే ఈ చారిత్రక టెస్టును నిర్వహించనుండటం చాలా సంతోషంగా ఉందని క్రికెట్ వెస్టిండీస్ సీఈవో జానీ గ్రేవ్ అన్నారు.
ఈ రెండు టెస్టుల సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఇందులో తొలి వన్డే జులై 27న, రెండో వన్డే జులై 29 బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరగనుండగా.. మూడో వన్డే ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడెమీలో జరగనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఐదు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ ఆగస్ట్ 3 నుంచి 13 వరకు ఉంటుంది. ఈ ఐదు టీ20ల సిరీస్ కు గయానే నేషనల్ స్టేడియం, బ్రియాన్ లారా అకాడెమీ వేదికలుగా ఉంటాయి.