Ind vs Pak in T20 World Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేసిన ఇర్ఫాన్ పఠాన్
14 September 2022, 19:42 IST
- Ind vs Pak in T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టును ఎంపిక చేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అయితే అతని టీమ్‌లో ఓ యువ ఆటగాడికి చోటు దక్కలేదు.
ఇండియా, పాకిస్థాన్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ ఆజం
Ind vs Pak in T20 World Cup: ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ రెండుసార్లు తలపడ్డాయి. ఈ హ్యాంగోవర్ నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటపడనే లేదు అప్పుడే మరో ఇండోపాక్ వార్‌పై చర్చ మొదలైంది. ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే ఈ దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరల్డ్‌కప్‌కు ఇప్పటికే సెలక్టర్లు టీమ్‌ను ఎంపిక చేయగా.. ఇప్పుడీ మ్యాచ్‌కు తుది జట్టును సెలక్ట్ చేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.
అక్టోబర్ 23న ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం టీమ్‌ను ఎంపిక చేసిన ఇర్ఫాన్ పఠాన్ అందులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మాత్రం చోటివ్వలేదు. పంత్ కంటే కార్తీకే ఈ మ్యాచ్‌కు బెటరని పఠాన్ తేల్చేశాడు. ఇది తప్ప అతని టీమ్‌లో పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేవు. అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేసేందుకు ఇర్ఫాన్ ప్రయత్నించాడు.
"నా అభిప్రాయం మేరకు తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు టీమ్‌లో అనుభజ్ఞులైన బౌలర్లు ఉండాలి. ఒక స్పిన్నర్ కూడా. ఆ లెక్కన నా టీమ్ చూస్తే.. రోహిత్, కేఎల్ రాహుల్, మూడోస్థానంలో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్, ఐదో స్థానంలో దీపక్ హుడా, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఏడో స్థానంలో దినేష్ కార్తీక్, ఎనిమిదో స్థానంలో ఒక రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అంటే చహల్, ఆ తర్వాత బుమ్రా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ ఉంటారు" అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
"ఈ టీమ్‌లో ఓ కాంబినేషన్ ఉంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వాళ్లలో ఇద్దరు క్వాలిటీ ఫాస్ట్ బౌలర్లు. వీళ్లు డెత్ ఓవర్లలోనూ మెరుగ్గా బౌలింగ్ చేయగలరు. డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేసేలా ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల నుంచి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. అది అర్ష్‌దీప్ అయినా కావచ్చు. అంటే ఇక్కడ స్పిన్నర్ విషయంలో మరో ఆలోచన లేదు. అయితే అర్ష్‌దీప్‌కు స్థానం కల్పించగలనా లేదా అన్నదే చూడాలి" అని పఠాన్ అన్నాడు.
టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మందితో కూడిన టీమ్‌ను బీసీసీఐ ఈ మధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ టీమ్‌పై ఇప్పటికే కొన్ని విమర్శలు వస్తున్నాయి. మహ్మద్ షమిలాంటి సీనియర్ బౌలర్‌ను తీసుకోకపోవడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. అతన్ని సెలక్టర్లు స్టాండ్‌బైగా ఉంచడం గమనార్హం.