Vengsarkar on T20 World Cup Team: టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ఆ ముగ్గురు ఉండాల్సింది: వెంగ్‌సర్కార్
Vengsarkar on T20 World Cup Team: టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ముగ్గురు ప్లేయర్స్ మిస్ అయ్యారని అన్నాడు మాజీ క్రికెటర్ వెంగ్‌సర్కార్. తానైతే వాళ్లను కచ్చితంగా ఎంపిక చేసేవాడినని చెప్పాడు.
Vengsarkar on T20 World Cup Team: టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాపై విశ్లేషణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టీమ్ బాగుందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పగా.. తాజాగా మరో మాజీ క్రికెటర్, గతంలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ చేసిన దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా స్పందించాడు. అయితే వెంగీ మాత్రం ముగ్గురు ప్లేయర్స్ ఇందులో మిస్ అయ్యారని అంటున్నాడు.
"మహ్మద్ షమి, ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్‌లను నేను కచ్చితంగా ఎంపిక చేసేవాడిని. ఈ ముగ్గురూ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారు. అందుకే వాళ్లకు టీ20ల్లో మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడిని" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వెంగ్‌సర్కార్ అన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్థానంపై కూడా వెంగీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
"ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనేదానిపై నేను కామెంట్ చేయను. అది కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్, వైస్ కెప్టెన్ నిర్ణయం. అయితే నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడని నేను భావిస్తున్నాను. అతడో గొప్ప ఫినిషర్ కాగలడు" అని వెంగ్‌సర్కార్ అన్నాడు. "టీ20 క్రికెట్ టెస్ట్, వన్డే క్రికెట్‌లాగా కాదు. వాటిలో ఓ బ్యాటర్ ఓ స్థానంలోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. టీ20 ఫార్మాట్‌లో ఎవరు ఎక్కడైనా బ్యాటింగ్ చేయొచ్చు. క్రీజులో సెట్ కావడానికి టైమ్ ఉండదు. ఎవరైనా వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడాల్సిందే" అని వెంగ్‌సర్కార్ అన్నాడు.
నిజానికి వరల్డ్‌కప్ టీమ్‌లో మహ్మద్ షమికి స్థానం దక్కకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లకు అతన్ని ఎంపిక చేసిన సెలక్టర్లు.. టీ20 వరల్డ్‌కప్ కోసం మాత్రం స్టాండ్‌బైగా ఉంచారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమి నిలిచాడు.
అయినా అతన్ని ఆసియాకప్‌కు ఎంపిక చేయలేదు. ఇప్పుడు వరల్డ్‌కప్‌కు కూడా పక్కన పెట్టారు. ఈ వింత నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు వెంగ్‌సర్కార్ కూడా షమిని తీసుకోవాల్సిందని అనడం విశేషం.