Shubman Gill: సచిన్, సెహ్వాగ్, గవాస్కర్‌ల సరసన శుభ్‌మన్ గిల్
Shubman Gill: వెస్టిండీస్‌తో చివరి వన్డేలో సెంచరీకి చేరువగా వచ్చిన 98 రన్స్ దగ్గర ఆగిపోయిన శుభ్‌మన్ గిల్ ఈ ఇన్నింగ్స్‌తో దిగ్గజాల సరసన నిలిచాడు. పైగా నిలకడగా రాణించిన అతడు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇండియన్ వెస్టిండీస్ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలుసు కదా. ఈ అద్భుత విజయంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మూడో మ్యాచ్‌లో అయితే 98 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. మరో ఓవర్ ఉంటే సెంచరీ చేసేవాడినని మ్యాచ్ తర్వాత గిల్ అన్నాడు.
సెంచరీ అందుకోలేకపోయినా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. అయితే మూడో వన్డేలో ఇన్నింగ్స్‌తో అతడు సచిన్, సెహ్వాగ్, గవాస్కర్‌లాంటి దిగ్గజాల సరసన నిలవడం విశేషం. వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చి 90ల్లో నాటౌట్‌గా నిలిచిన వాళ్ల లిస్ట్‌లో గిల్ చేరాడు. గతంలో ఈ దిగ్గజాలంతా ఇలాగే సెంచరీకి చేరువగా వచ్చినా దానిని అందుకోలేక అజేయంగా నిలిచారు.
ఈ లిస్ట్‌లో క్రిష్ణమాచారి శ్రీకాంత్ (93), సునీల్ గవాస్కర్ (92), సచిన్ టెండూల్కర్ (96), వీరేంద్ర సెహ్వాగ్ (99), శిఖర్ ధావన్ (97) ఉన్నారు. వీళ్లంతా మ్యాచ్ ముగియడమో లేక ఓవర్లు పూర్తవడం వల్ల సెంచరీ చేయలేకపోయారు. ఇప్పుడు గిల్ కూడా రెండు రన్స్ తేడాతో మూడంకెల స్కోరు మిస్ అయ్యాడు. వర్షం కురవకపోయి ఉంటే సెంచరీ చేసేవాడినని మ్యాచ్ తర్వాత గిల్ అన్నాడు.
"సెంచరీ చేస్తాననే అనుకున్నా. కానీ వర్షం నా కంట్రోల్‌లో ఉండదు కదా. తొలి రెండు వన్డేల్లో నేను ఔటైన విధానం అసంతృప్తి కలిగించింది. ఈ మ్యాచ్‌లో మాత్రం బాల్ ఎలా మూవ్ అయితే అలా ఆడాలని నిర్ణయించుకున్నాను" అని గిల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు. వన్డే సిరీస్ ముగియడంతో గిల్ తిరిగి ఇంటికి వచ్చేయనున్నాడు. టీ20 సిరీస్‌లో గిల్‌కు చోటు దక్కలేదు.
సంబంధిత కథనం