Jasprit Bumrah Training: టీ20 వరల్డ్‌కప్ కోసం చెమటోడుస్తున్న బుమ్రా.. వీడియో
Jasprit Bumrah Training: టీ20 వరల్డ్‌కప్ కోసం చెమటోడుస్తున్నాడు స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. గాయంతో ఆసియా కప్‌కు దూరమైన అతడు.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభం కానుండగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
Jasprit Bumrah Training: ఆసియాకప్‌లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఇండియన్ ఫ్యాన్స్‌కు ఇది కాస్త ఊరట కలిగించే విషయం. స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. రానున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లతోపాటు టీ20 వరల్డ్‌కప్ కోసం అతడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా బుధవారం (సెప్టెంబర్ 14) అతడు ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో అతడు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండటం చూడొచ్చు. "పని చేస్తే మీకు అవసరం ఉన్నది దక్కుతుంది. కఠినంగా శ్రమిస్తే.. మీకు కావాల్సింది దక్కుతుంది" అంటూ ఈ వీడియోకు బుమ్రా క్యాప్షన్ ఉంచడం విశేషం. అతడు గాయం నుంచి కోలుకోవడంతో రానున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో, టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేశారు.
వరల్డ్‌కప్ గెలవాలంటే పేస్ బౌలింగ్‌లో బుమ్రా కీలకం కానున్నాడు. టీమ్ తరఫున నిలకడగా బౌలింగ్ చేస్తున్న అతడు.. ఆసియాకప్‌కు దూరం కావడంతో ఇండియా కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది. ఈ టోర్నీలో పేస్ బౌలింగ్ మరీ బలహీనంగా కనిపించింది. ముఖ్యంగా డెత్ ఓవర్లే కీలకమైన రెండు మ్యాచ్‌లలో ఓటమికి కారణమయ్యాయి. మరో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ పవర్ ప్లేలో బాగానే బౌలింగ్ చేస్తున్నా.. చివర్లో చేతులెత్తేస్తున్నాడు.
దీంతో బుమ్రా డెత్ ఓవర్లలో బౌలింగ్‌కు కీలకం కానున్నాడు. ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కాబోతోంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు మళ్లీ పూర్తిస్థాయిలో ఫామ్‌లోకి రావడానికి బుమ్రాకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లు ఉపయోగపడనున్నాయి. వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాలో జరగనుండటంతో అక్కడి పరిస్థితులు బుమ్రాకు అనుకూలిస్తాయి. ఇది టీమిండియాకు మేలు చేసేదే.
ఈ మెగా టోర్నీకి ముందు బుమ్రాకు ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. వీటికి తోడు రెండు వామప్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అతనిలాంటి టాలెంటెడ్ బౌలర్‌కు 8 మ్యాచ్‌లు చాలా ఎక్కువ. గతేడాది వరల్డ్‌కప్‌లోనూ బుమ్రా బాగానే రాణించినా.. మిగతా బౌలర్ల నుంచి సహకారం లభించలేదు.