Bhuvneshwar Kumar: ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ పేస్‌బౌలర్ భువనేశ్వర్
టీమిండియా పేస్‌బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో భువీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
బెంగళూరు: ఇండియన్ టీమ్ సీనియర్ పేస్‌బౌలర్ భువనేశ్వర్ కుమార్ చాలా రోజుల తర్వాత మళ్లీ టాప్ ఫామ్‌లో కనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో పవర్ ప్లేలో అతడు అదరగొట్టాడు. ఐదు టీ20ల సిరీస్‌లో అతడు ఆరు వికెట్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా నిలిచాడు. భువీ 10 ఏళ్ల కెరీర్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకోవడం ఇది నాలుగోసారి.
ఈ క్రమంలో అతడు ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ పేసర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు మూడేసిసార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. ఆ ఇద్దరినీ భువనేశ్వర్ వెనక్కి నెట్టాడు. నాలుగు మ్యాచ్‌లలో ఆరు వికెట్లు తీసుకున్న భువనేశ్వర్.. పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని ఎకానమి కూడా కేవలం 6.05 కావడం విశేషం.
కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో అతడు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అందులో మూడు వికెట్లు పవర్ ప్లేలోనే వచ్చాయి. నిజానికి పదేళ్ల కిందటే ఇదే కటక్‌లో పాకిస్థాన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన భువనేశ్వర్.. మహ్మద్ హఫీజ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతోపాటు మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు సౌతాఫ్రికాతో సిరీస్‌లో హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లు తీసుకున్నా.. భువీ వికెట్లతోపాటు మంచి ఎకానమీ రేటుతో బౌలింగ్ చేయడంతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అతనికి దక్కింది.
అటు సౌతాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ కూడా భువీపై ప్రశంసలు కురిపించాడు. సిరీస్ మొత్తం భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, పవర్ ప్లేలలో తమను ఒత్తిడిలోకి నెట్టాడని అన్నాడు. ఒక్క ఢిల్లీ మ్యాచ్‌లో తప్ప మిగతా మ్యాచ్‌లలో పవర్ ప్లేలలో ఇండియా తమ టీమ్‌ను డామినేట్ చేసిందని బౌచర్ చెప్పాడు.
సంబంధిత కథనం