WTC Final-Virat Kohli : కోహ్లీపై ఆసీస్ ఆటగాళ్ల ప్రశంసలు.. ప్లీజ్ ఎక్కువ పరుగులు చేయోద్దు
05 June 2023, 10:10 IST
- WTC Final 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్, ఆస్ట్రేలియా చివరి మ్యాచ్‌లో తలపడేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇరు జట్లు కూడా కఠోర ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. అయితే ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు భారత జట్టు లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.
విరాట్ కోహ్లీ
2021 ఎడిషన్‌లో కూడా, భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఛాంపియన్‌గా అవతరించే దిశగా టీమిండియా(Team India) దూసుకుపోతోంది. ఇప్పుడు అద్భుత ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈ ఎడిషన్‌లో భారత జట్టుకు నిర్ణయాత్మక ఆటగాడు అవుతాడనడంలో సందేహం లేదు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final)కు ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరాన్ గ్రీన్, మార్నస్ లాబుస్చెయిన్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ అందరూ కోహ్లీ గురించి గొప్పగా మాట్లాడారు. ఇదే సందర్భంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్‌తో ఎక్కువ పరుగులు చేయకూడదని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
విరాట్ కోహ్లి గురించి కామెరాన్ గ్రీన్ మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా భారత్‌ను ముందుండి విజయవంతంగా నడిపించిన భారత ప్రీమియర్ క్రికెటర్ అని అన్నాడు. డేవిడ్ వార్నర్(David Warner) కూడా విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ గురించి గొప్పగా మాట్లాడాడు. కోహ్లీ కవర్ డ్రైవ్ నమ్మశక్యంగా ఉండదని చెప్పాడు. ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా విరాట్ కోహ్లీని 'పోటీగల' ఆటగాడు అని పేర్కొన్నాడు. మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ, కోహ్లీని చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడిగా అభివర్ణించాడు. అతను భారత మిడిల్ ఆర్డర్‌కు మూలస్తంభం కూడా అని చెప్పాడు.
ఆస్ట్రేలియా ప్రముఖ ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith) విరాట్ కోహ్లీని 'క్రికెట్ సూపర్ స్టార్'గా అభివర్ణించాడు. 'అతను చాలా కాలంగా క్రికెట్ సూపర్ స్టార్‌గా ఉన్నాడు. ఎప్పుడూ ఆస్ట్రేలియాతో ఆడటానికి ఇష్టపడతాడు. మాపై కూడా చాలా పరుగులు చేశాడు. ఈసారి ఎక్కువ సందడి చేయకుండా అతన్ని ఆపగలమని మేం ఆశిస్తున్నాం.' అని స్మిత్ అన్నాడు.
విరాట్ కోహ్లీ(Virat Kohli)కి టెస్టు ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు ఉంది. ఆసీస్‌తో 24 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో, కోహ్లీ ఆస్ట్రేలియాపై 8 సెంచరీలు సాధించాడు. ఈ సంవత్సరం జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో 186 పరుగులు చేశాడు. కోహ్లీ ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL)లో అద్భుతమైన ఫామ్ తో కనిపించాడు. ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.