ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన మహ్మద్ రిజ్వాన్
07 September 2022, 16:02 IST
- ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లాడు పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్. తమ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి అతడీ ఘనత సాధించడం విశేషం.
మహ్మద్ రిజ్వాన్
ICC T20 Rankings: టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్ ర్యాంక్ సాధించాడు పాకిస్థాన్ టీమ్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్. ఆసియా కప్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో టాప్ ఫామ్‌లో ఉన్న రిజ్వాన్.. ఇప్పటి వరకూ టాప్‌లో ఉన్న తన కెప్టెన్, ఓపెనింగ్ పార్ట్‌నర్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టాడు. ఇండియాతో మ్యాచ్‌లో 71 రన్స్ చేసి ఆ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
అంతకుముందు హాంకాంగ్‌పై కూడా 78 రన్స్ చేశాడు. ప్రస్తుతం పాక్ టీమ్‌లో బాబర్ ఆజంతోపాటు అత్యంత నిలకడగా ఆడుతున్న ప్లేయర్ రిజ్వానే. నిజానికి బాబర్ ఆసియాకప్‌లో విఫలమవుతున్నా.. పాక్ టీమ్ భారాన్ని రిజ్వాన్ మోస్తున్నాడు. ఇదే ఊపులో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 815 పాయింట్లతో టాప్‌లోకి వెళ్లాడు. గతంలో అతను 792 రేటింగ్ పాయింట్స్‌తో ఉండగా.. తాజా ర్యాంకింగ్స్‌లో అదనంగా 19 పాయింట్లు సాధించి కెరీర్ బెస్ట్ పాయింట్లు, ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
టీ20ల్లో టాప్ ప్లేస్ అందుకున్న మూడో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్. అతని కంటే ముందు బాబర్ ఆజం, మిస్బావుల్ హక్ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. బాబర్ ఏకంగా 1155 రోజుల పాటు టేబుల్‌లో టాప్‌లో ఉండగా.. మిస్బా 313 రోజులు టాప్‌లో ఉన్నాడు.ఇక తాజా ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నాలుగోస్థానానికి దిగజారాడు.
శ్రీలంకపై 72 రన్స్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ 4 స్థానాలు మెరుగుపరచుకొని 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అటు విరాట్ కోహ్లి 29వ స్థానంలో ఉన్నాడు. అటు ఆసియా కప్‌లో రాణిస్తున్న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్స్ కూడా ఈ ర్యాంకుల్లో మెరుగయ్యారు.