Virat Kohli Praises Babar Azam: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటే మ్యాచే ఆదివారం నాడు జరిగింది. దుబాయ్ వేదికగా ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయం ఎదుర్కొన్నప్పటికీ భారత్ ఆటగాళ్లు పాక్ ప్లేయర్ల మధ్య స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ క్రీడా స్ఫూర్తిని ఆచరిస్తున్నారు. ఆదివారం నాడు మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ప్రశంసలు కురిపించడమే ఇందుకు ఉదాహరణ.
"బాబర్ ఆజం చాలా మంచి వ్యక్తి. ఇద్దరి మధ్య మంచి సంభాషణలు జరిగాయి. అతడు నాకు చాలా జూనియర్. అతడి పట్ల గౌరవముంది. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. బాబర్ ఎప్పుడూ నేర్చుకోవాలని ఆసక్తి కనబరుస్తుంటాడు. ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. 2019 ప్రపంచకప్ తర్వాత అతడు నాతో మాట్లాడాడు. నేర్చుకోవాలనే తపను కలిగి ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా రాణిస్తున్నాడు. అతడు చాలా స్పష్టతను, ప్రతిభను కలిగిన ఆటగాడు" అని విరాట్ కోహ్లీ బాబర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పాక్ ఆటగాళ్లంతా తమతో స్నేహంతో ఉంటారని కోహ్లీ తెలిపాడు.
"అతడితో(బాబర్ ఆజం) మీటింగ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. వారంతా చాలా మంచి వారు. మాతో చాలా స్నేహంగా ఉంటారు. ఇద్దరి మధ్య పరస్ఫర గౌరవాభిమానాలు ఉన్నాయి. గతేడాదే నాకు ఆ విషయం తెలిసింది. మ్యాచ్‌లప్పుడు రెండు జట్లు పోటీ పడినప్పటికీ.. ఇద్దరం ఒకరినొకరం గౌరవించుకుంటాం." అని కోహ్లీ అన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో బాబర్ ఆజం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అతడు మూడు మ్యాచ్‌ల్లోనూ 10, 9, 14 పరుగులతో సరిపెట్టుకున్నాడు. మరోపక్క విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో తన ఫామ్‍ను తిరిగి అందిపుచ్చుకున్నాడు. ఆదివారం నాడు పాక్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 44 బంతుల్లో 60 పరుగులతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో మంచి భాగస్వామ్యాన్ని బిల్డ్ చేశాడు. ఫలితంగా భారత్ ఆ మ్యాచ్‌లో 7 వికెట్ల నష్టపోయి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దాయాది జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(71) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.