Virat Kohli: 'మా విరాట్‌ కోహ్లి' అని అందుకే అన్నాను: పాక్‌ క్రికెటర్‌ రిజ్వాన్‌-pakistans mohammad rizwan clarifies on his our virat kohli statement ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: 'మా విరాట్‌ కోహ్లి' అని అందుకే అన్నాను: పాక్‌ క్రికెటర్‌ రిజ్వాన్‌

Virat Kohli: 'మా విరాట్‌ కోహ్లి' అని అందుకే అన్నాను: పాక్‌ క్రికెటర్‌ రిజ్వాన్‌

Hari Prasad S HT Telugu
Jun 07, 2022 06:01 PM IST

విరాట్‌ కోహ్లికి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో మన దాయాది పాకిస్థాన్‌ కూడా ఒకటి. అక్కడి సాధారణ క్రికెట్‌ ఫ్యాన్సే కాదు.. ఆ దేశ క్రికెటర్లు కూడా మన కోహ్లికి వీరాభిమానులే.

టీ20 వరల్డ్ కప్ లో రిజ్వాన్ తో విరాట్ కోహ్లి
టీ20 వరల్డ్ కప్ లో రిజ్వాన్ తో విరాట్ కోహ్లి (Twitter)

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్ రిజ్వాన్‌ గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాపై ఆడిన ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చాడు. ఓ వరల్డ్‌కప్‌లో ఇండియాపై పాకిస్థాన్‌ తొలిసారి గెలవడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌ కంటే కూడా ముగిసిన తర్వాత అతడు అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని హత్తుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. కోహ్లిని అభిమానించే అతడు.. తొలిసారి అతన్ని కలిసిన సందర్భంగా తన అభిమానాన్ని అలా చాటుకున్నాడు.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలోనూ మా విరాట్‌ కోహ్లి అని అతడు అనడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ నోటి నుంచి ఆ మాట రావడంతో ఫ్యాన్స్‌ అవాక్కయ్యారు. అయితే తాను అలా ఎందుకు అన్నానో ఇప్పుడు రిజ్వాన్‌ వివరించాడు. అసలు కోహ్లి గురించి అంతకు ముందు తాను విన్నదంతా అతన్ని కలిసి తర్వాత ఉత్తదే అని తేలిపోయిందని చెప్పాడు.

"కోహ్లిని కలవడం అదే మొదటిసారి. విరాట్‌ చాలా దూకుడుగా ఉంటాడంటూ అంతకుముందు చాలా మంది అతని గురించి చెప్పారు. కానీ మ్యాచ్‌కు ముందు, తర్వాత అతడు నన్ను కలిసి విధానం అద్భుతం. నేను మా విరాట్‌ కోహ్లి అన్నానంటే దానికి కారణం మేమంతా ఒకే ఫ్యామిలీ. గ్రౌండ్‌లోకి ఎంటర్‌ అయినప్పుడు ఎవరూ స్టార్‌ కాదు. ప్లేయర్స్‌ మధ్య సోదరభావం, ఇతరత్రా ఏమీ ఉండవు. కానీ ఫీల్డ్ బయట మాత్రం మేము కోహ్లిని కలిసినా, ధోనీని కలిసినా ఎంతో ప్రేమతోనే కలిసాం" అని రిజ్వాన్‌ చెప్పాడు.

ఇండియా, పాకిస్థాన్‌ మధ్య బైలాటరల్‌ సిరీస్‌లు లేకపోయినా.. ఐసీసీ టోర్నీల్లోనే రెండు టీమ్స్‌ తలపడుతున్నాయి. ఇక కౌంటీ క్రికెట్‌లోనూ అప్పుడప్పుడూ రెండు దేశాల ప్లేయర్స్‌ కలిసి ఆడుతున్నారు. ఈ మధ్యే రిజ్వాన్‌తో కలిసి పుజారా ఆడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్యా కూడా మంచి స్నేహం ఏర్పడింది. రిజ్వాన్‌కు పుజారా ట్విటర్‌ ద్వారా బర్త్‌డే విషెస్‌ కూడా చెప్పాడు. ఈ ఇద్దరూ ససెక్స్‌ టీమ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.

ఇండియా, పాకిస్థాన్‌ ప్లేయర్స్‌ బయట ఎప్పుడు కలిసినా ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటారని రిజ్వాన్‌ చెప్పాడు. "కౌంటీ క్రికెట్‌లో కూడా నేను పుజారాతో కలిసి ఆడాను. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. నేనే అతన్ని ఆట పట్టించే వాన్ని. అతడు నవ్వేవాడు. కోహ్లితోనూ అంతే. అతన్ని తొలిసారి కలిసినప్పుడు కూడా ఎంతో ప్రేమపూర్వకంగానే ఉన్నాను" అని రిజ్వాన్‌ తెలిపాడు.

WhatsApp channel

సంబంధిత కథనం