ICC on Indore pitch: బీసీసీఐ అడిగింది.. ఐసీసీ వెనక్కి తగ్గింది.. ఇండోర్ పిచ్ రేటింగ్ మార్పు
27 March 2023, 14:23 IST
ICC on Indore pitch: బీసీసీఐ అడిగింది.. ఐసీసీ వెనక్కి తగ్గింది.. ఇండోర్ పిచ్ రేటింగ్ మార్చింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరిగిన ఈ పిచ్ కు గతంలో ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇండోర్ పిచ్
ICC on Indore pitch: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పిచ్ ల గురించి ఎంతటి చర్చ జరిగిందో తెలుసు కదా. తొలి మూడు టెస్టుల్లో స్పిన్ కు విపరీతంగా అనుకూలించిన పిచ్ లపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మూడో టెస్టు జరిగిన ఇండోర్ పిచ్ పై ఆట రెండున్నర రోజుల్లోనే ముగిసింది.
దీంతో మ్యాచ్ రిఫరీ సిఫార్సు మేరకు ఈ పిచ్ కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు స్టేడియం ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు కూడా చేర్చింది. అయితే దీనిని బీసీసీఐ సవాలు చేసింది. దీనిపై స్పందించిన ఐసీసీ సోమవారం (మార్చి 27) రేటింగ్ మార్చింది. పూర్ బదులు సగటు కన్నా తక్కువ రేటింగ్ ఇచ్చింది.
ఇండోర్ పిచ్ పై రెండు రోజుల్లోనే 31 వికెట్లు పడటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో స్పిన్నర్లే 26 వికెట్లు తీశారు. స్పిన్ ఉచ్చు బిగించి సిరీస్ గెలుద్దామనుకున్న ఇండియానే ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా 9 వికెట్లతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ కు రిఫరీగా చేసిన క్రిస్ బ్రాడ్ పిచ్ విషయంలో కఠినంగా వ్యవహరించాడు.
"పిచ్ చాలా పొడిగా ఉంది. బ్యాట్, బాల్ మధ్య బ్యాలెన్స్ కనిపించలేదు. మొదటి నుంచీ స్పిన్నర్లకే అనుకూలించింది" అని బ్రాడ్ తన రిపోర్టులో చెప్పాడు. దీంతో వెంటనే ఈ పిచ్ కు పూర్ రేటింగ్ ఇచ్చింది ఐసీసీ. అయితే సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ దీనిని సవాలు చేసింది. ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ లీడ్ చేసిన ఐసీసీ ప్యానెల్ దీనిపై విచారణ జరిపింది.
రిఫరీ చెప్పినట్లు పిచ్ పై మరీ అంత అస్థిరమైన బౌన్స్ లేదని, అందుకే రేటింగ్ ను పూర్ నుంచి సగటు కంటే తక్కువకు మారుస్తున్నట్లు ఐసీసీ ప్యానెల్ స్పష్టం చేసింది. దీనికి కేవలం ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే కేటాయించారు.