Yo-Yo test : క్రికెటర్లకు యొ-యొ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు? ఎలా లెక్కిస్తారు?
24 January 2022, 20:59 IST
- Yo-Yo test: యొ-యొ టెస్ట్ స్కోరును బట్టే ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్థానం దక్కుతుంది. ఎంతటి క్రికెటర్ అయినా ఈ టెస్ట్‌లో ఫెయిలైతే ఇక అంతే. ఈ మధ్యే యొ-యొ టెస్ట్‌తో పాటు 2 కిలోమీటర్ల పరుగును కూడా బీసీసీఐ తీసుకొచ్చింది. ఈ రెండు టెస్టుల్లో ఏదో ఒక టెస్ట్‌ను క్రికెటర్ కచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది.
యొ-యొ టెస్ట్
ఫుట్‌బాల్, టెన్నిస్‌లాంటి స్పోర్ట్స్‌తో పోలిస్తే క్రికెటర్లకు ఉండే ఫిట్‌నెస్ తక్కువే అని చెప్పాలి. అయితే స్పీడు పెరుగుతున్న ఆధునిక క్రికెట్‌లో ఓ క్రికెటర్‌కు కూడా అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్ ప్రమాణాలు తప్పనిసరిగా మారాయి. అందులో భాగంగానే ఇప్పుడు క్రికెటర్లకు కూడా యొ-యొ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ స్కోరును బట్టే ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్థానం దక్కుతుంది. ఎంతటి క్రికెటర్ అయినా సరే ఈ టెస్ట్‌లో ఫెయిలైతే ఇక అంతే. ఈ మధ్యే యొ-యొ టెస్ట్‌తో పాటు 2 కిలోమీటర్ల పరుగును కూడా బీసీసీఐ తీసుకొచ్చింది.
ఈ రెండు టెస్టుల్లో ఏదో ఒక టెస్ట్‌ను క్రికెటర్ కచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది. 2 కిలోమీటర్లను పేస్ బౌలర్లయితే 8 నిమిషాల 15 సెకన్లలో, మిగతావాళ్లయితే 8 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐతోపాటు మిగతా క్రికెట్ బోర్డులు కూడా ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్న యొ-యొ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు? అసలు ఈ టెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? స్కోరు ఎలా లెక్కిస్తారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
అసలేంటీ యొ-యొ టెస్ట్?
సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక ఫిట్‌నెస్ టెస్ట్. ముఖ్యంగా పరుగు ప్రధానంగా సాగే క్రికెట్‌లాంటి గేమ్స్‌లో ఈ యొ-యొ టెస్ట్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. వివిధ స్థాయిలలో యొ-యొ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ కాలంలో క్రికెటర్ల షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో తెలుసు కదా. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే అసలు క్రికెటర్లు ఎక్కువ విశ్రాంతి లేకుండా ఎంతమేర ఫిట్‌గా ఉండగలరో తెలుసుకోవడానికే ఈ యొ-యొ టెస్ట్ నిర్వహిస్తున్నారు. గతంలో దీనినే బీప్ టెస్ట్ లేదా లేజర్ టెస్ట్ అనేవాళ్లు. 20 మీటర్ల ఎడంతో రెండు కోన్‌లను ఏర్పాటు చేస్తారు. వీటి మధ్య పరుగెత్తడమే క్రికెటర్లు చేయాల్సిన పని. అయితే ఇది చెప్పినంత సులువు కాదు. ఇందులో ఉండే స్థాయిలను బట్టి.. ప్రతి ప్లేయర్ తాను పరుగెత్తే వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాలి.
ఒకసారి ఓ ప్లేయర్ ఓ కోన్ నుంచి మరో కోన్ వరకూ వెళ్లి, దాని చుట్టూ తిరిగి మళ్లీ తొలి కోన్ ఉంచిన దగ్గరికి రావాల్సి ఉంటుంది. అయితే ఇది నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓ ప్లేయర్ పరుగు ప్రారంభించే సమయంలో ఒక బీప్ సౌండ్ వినిపిస్తుంది. మరో బీప్ సౌండ్ వినిపించే లోపు ఆ ప్లేయర్ అవతలి ఎండ్‌కు వెళ్లాలి. తిరిగి మరో బీప్ వినిపించేలోపు మళ్లీ ప్రారంభించే స్థానానికి రావాలి. ఇలా ఒకసారి చేస్తే ఒక షటిల్ పూర్తయినట్లుగా పరిగణిస్తారు. అంటే ఒక షటిల్‌లో ఓ ప్లేయర్ 40 మీటర్లు పరుగెత్తుతాడు. లెవల్ పెరుగుతున్న కొద్దీ ఒక్కో లెవల్‌లో ఒకటి కంటే ఎక్కువ షటిల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఒక్కో షటిల్ అంటే 40 మీటర్ల పరుగు పూర్తి చేయడానికి పట్టే సమయం తగ్గుతూ ఉంటుంది.
యొ-యొ టెస్ట్ లెవల్స్ ఏంటి?
ప్రస్తుతం బీసీసీఐ మన క్రికెటర్లకు యొ-యొ టెస్ట్ పాస్ కావడానికి స్కోరు 17:1గా ఉండటం తప్పనిసరి చేసింది. గతంలో ఇది 16:1గా ఉండేది. అయితే ఈ స్కోరు ఏంటన్నది తెలవాలంటే లెవల్స్ గురించి తెలుసుకోవాలి. యొ-యొ టెస్ట్ లెవల్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఈ లెవల్‌లో మొత్తం 40 మీటర్ల దూరం పరుగెత్తడానికి 14.4 సెకన్ల సమయం ఉంటుంది. అంటే మధ్యలో మరో పాయింట్‌కు చేరడానికి 7.2 సెకన్ల దగ్గర ఓ బీప్ వస్తుంది. ఈ లెవల్‌లో ఓ ప్లేయర్ గంటకు కనీసం 10 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తాలి. ఆ తర్వాత లెవల్ 9, 11, 12.. ఇలా 23 వరకూ ఉంటాయి. లెవల్ 5లో కేవలం ఒక షటిలే ఉంటుంది.
లెవల్ 11లో 2, 12లో ౩, 13లో 4, 14 నుంచి 19 వరకూ 8 షటిల్స్ ఉంటాయి. ఇప్పుడు బీసీసీఐ మన క్రికెటర్లకు 17:1 స్కోరు తప్పనిసరి చేసింది అంటే.. ప్రతి క్రికెటర్ 17వ లెవల్‌లోని ఒక షటిల్ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే అంతకుముందు 14 నుంచి 16వ లెవల్ వరకూ ఒక్కోదాంట్లో 8 షటిల్స్‌ను పూర్తి చేసి ఉండాలి. ఒక్కో లెవల్‌కు షటిల్స్ సంఖ్య పెరుగుతున్నట్లే 40 మీటర్ల దూరం అంటే ఒక షటిల్ పూర్తి చేయడానికి పట్టే సమయం తగ్గుతూ ఉంటుంది. 17వ లెవల్‌లో ఒక షటిల్ పూర్తి చేయడానికి కేవలం 9 సెకన్లే ఉంటుంది. లెవల్ 5లో ఇది 14.4 సెకన్లు ఉన్న విషయం తెలుసు కదా. అంటే లెవల్ 17లో ఓ ప్లేయర్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తాలి.
యొ-యొ టెస్ట్ టైమ్ మిస్సయితే..
ఒక షటిల్ పూర్తయిన తర్వాత ప్రతి ప్లేయర్‌కు 10 సెకన్ల పాటు కోలుకోవడానికి సమయం ఉంటుంది. ఆ తర్వాత మరో లెవల్ లేదా షటిల్ ప్రారంభించాలి. షటిల్ పూర్తి చేసే సమయంలో మొత్తం మూడు బీప్స్ వస్తాయని తెలుసు కదా. షటిల్ ప్రారంభానికి ముందు ఒక బీప్, 20 మీటర్ల దూరానికి మరో బీప్, ఆ తర్వాత మరో 20 మీటర్లకు మరో బీప్ ఉంటుంది. ఈ బీప్ సౌండ్ వినిపించేలోపే ప్లేయర్ తన టార్గెట్‌ను రీచ్ కావాల్సి ఉంటుంది. ఒక బీప్ మిస్సయితే తొలుత కోచ్, ట్రైనర్ సదరు ప్లేయర్‌కు వార్నింగ్ ఇస్తారు. ఒకవేళ రెండు బీప్స్ మిస్సయితే ఆ ప్లేయర్ టెస్ట్ ముగిసినట్లే. అలాంటి ప్లేయర్ యొ-యొ టెస్ట్‌లో ఫెయిలయ్యాడని అంటారు.
మిగతా క్రికెట్ టీమ్స్ యొ-యొ స్కోరు ఏంటి?
మన ఇండియన్ క్రికెటర్లకు బీసీసీఐ 17:1 లెవల్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలుసు కదా. అయితే ఈ స్కోరు ఒక్కో క్రికెట్ బోర్డులో ఒక్కోలా ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ప్లేయర్స్‌కు 17:4 స్కోరు తప్పనిసరి చేసింది. ఇదే వెస్టిండీస్ క్రికెటర్లకు 19:1 ఉండగా.. న్యూజిలాండ్ క్రికెటర్లకు అత్యధికంగా 20:1గా ఉంది. అంటే ప్రతి న్యూజిలాండ్ ప్లేయర్ నేషనల్ టీమ్‌కు అర్హత సాధించాలంటే యొ-యొ టెస్ట్ 20వ లెవల్‌లో కనీసం ఒక షటిల్ వరకూ పూర్తి చేయాల్సిందే. ఇండియన్ క్రికెటర్లకు గతంలో 16:1 స్కోరు ఉన్నా అప్పట్లోనే కెప్టెన్ విరాట్ కోహ్లి మిగతా వాళ్ల కంటే ఎక్కువగా 17:1 స్కోరు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఈ స్కోరునే బీసీసీఐ తప్పనిసరి చేసింది. ఈ టెస్ట్ తమ వల్ల కాదు అనుకునే క్రికెటర్లు 2 కిలోమీటర్ల పరుగులో పాల్గొనాలి.