తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కావాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫిట్‌నెస్‌ టిప్స్‌ పాటించండి

ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కావాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫిట్‌నెస్‌ టిప్స్‌ పాటించండి

Hari Prasad S HT Telugu

24 January 2022, 17:57 IST

google News
    • ఈ మధ్య కాలంలో వస్తున్న క్రికెటర్లలో నైపుణ్యానికి కొదవ లేకపోయినా.. టీమ్‌లోకి వచ్చిన కొద్దికాలానికి గాయాల బారిన పడి కెరీర్‌ను ముగిస్తున్నారు. అందుకే చెప్పేది.. క్రికెట్‌లో టాలెంట్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఫిట్‌నెస్‌కూ అంతే. క్రికెటర్‌గా ఎదగాలనుకుంటే శరీరాన్ని దృఢంగా మార్చుకునే శిక్షణ తీసుకోవాలి.
ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రాక్టీస్
ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రాక్టీస్ (PTI)

ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రాక్టీస్

ఇండియాలో ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌కు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వాళ్లు అనుభవించే స్టార్‌ స్టేటస్‌ను చేసి చాలా మంది క్రికెట్‌ను ఓ కెరీర్‌గా మలచుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌లు కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా నేషనల్‌ టీమ్‌కు సుదీర్ఘ కాలం ఆడాలంటే స్కిల్‌, టెక్నిక్‌ ఉంటే సరిపోదు. అంతకన్నా ఎక్కువగా కావాల్సింది ఫిట్‌నెస్. 

ఎంత టాలెంట్‌ ఉన్నా.. ఫిట్‌నెస్‌ లేకపోతే ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడలేరు. లెజెండరీ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌నే తీసుకోండి. ఏకంగా 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలాడు. నిలకడగా ఆడటంతోపాటు అంతకాలం పాటు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం అంటే మాటలు కాదు. ఇప్పుడు ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లిని చూడండి. ప్రపంచ క్రికెట్‌లో అతని స్థాయి ఫిట్‌నెస్‌ ఎవరికీ లేదు. 

అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడేటప్పుడు స్పీడు కూడా ముఖ్యమే. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తాలన్నా, ఫాస్‌ బౌలింగ్‌ చేయాలన్నా, ఫీల్డింగ్‌లో బంతి కంటే వేగంగా పరుగెత్తి ఛేజ్‌ చేయాలన్నా.. స్పీడ్‌ అనేది ముఖ్యం. అందుకే ఈ స్పీడ్‌ ట్రైనింగ్‌ కూడా యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పబోయే కసరత్తులు రోజూ చేస్తే.. ఫిట్‌గా ఉండటంతోపాటు, గాయాల బారిన పడకుండా క్రికెట్‌ కెరీర్‌నూ కొనసాగించగలుగుతారు.

కెటిల్‌బాల్‌ స్నాచ్‌

ఓ క్రికెటర్‌ బౌలరైనా, ఫీల్డరైనా, బ్యాటరైనా.. కావాల్సింది ఆర్మ్‌ పవర్‌. చేతులు బలంగా ఉంటేనే భారీ షాట్‌ కొట్టగలరు, వేగంగా బౌలింగ్‌ చేయగలరు లేదంటే దూరం నుంచి కూడా బంతిని విసరగలుగుతారు. ఈ ఆర్మ్‌ పవర్‌ పెంచుకోవడానికి పనికొచ్చేదే ఈ కెటిల్‌బాల్ వర్కవుట్‌. కెటిల్‌బాల్‌ స్నాచ్‌, స్వింగ్‌ వంటి కసరత్తులతో మీ చేతులను బలంగా మార్చుకోవచ్చు. 

కాళ్లు కాస్త దూరంగా ఉంచి ఓ చేత్తో కెటిల్‌బాల్‌ను తలపైకి ఎత్తి కాసేపు అలాగే ఉంచి మళ్లీ కిందికి తీసుకురావాలి. ఇలా రెండు చేతులతోనూ మార్చి మార్చి చేయాలి. అలాగే కెటిల్‌బాల్‌ స్వింగ్‌ ఎక్సర్‌సైజులు కూడా మీ కండబలాన్ని పెంచుతుంది. రెండు చేతులతో బాల్‌ను పట్టుకొని కాళ్ల మధ్య నుంచి తలపై వరకూ తీసుకెళ్లి మళ్లీ కిందికి తీసుకురావాలి.

బెంచ్‌ప్రెస్‌

మీ శరీర పైభాగం దృఢంగా ఉండటానికి ఈ బెంచ్‌ ప్రెస్‌ ఎక్సర్‌సైజులు పనికొస్తాయి. మీ ఛాతీ, ట్రైసెప్స్‌, భుజాలు ఈ కసరత్తుల ద్వారా బలంగా మారుతాయి. బెంచ్‌పై వెల్లకిలా పడుకొని అటూ, ఇటూ బరువులు ఉన్న బార్‌ను పైకి ఎత్తి కాసేపు అలాగే ఉంచి, మళ్లీ ఛాతీ వరకూ తీసుకురావాలి. ఇలాగే పైకి, కిందికి కొన్నిసార్లు చేస్తూ ఉండాలి. మీరు ఎంత బరువు మోయగలరో అంతే మోయండి. లేదంటే గాయాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

స్క్వాట్స్‌

ఈ స్క్వాట్స్‌ మీ తొడలతోపాటు శరీర కింది భాగాన్ని దృఢంగా మార్చడానికి ఉపయోగపడతాయి. దీనికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఇది ఒకరకంగా గుంజీలు తీయడంలాంటిదే. కాళ్లు కాస్త ఎడంగా పెట్టి, చేతులను ముందుకు చాచి మోకాళ్లను వంచాలి. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇలా మోకాళ్లపై కూర్చోవడం, పైకి లేవడం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కాసేపు మోకాళ్లను వంచి, అదే పొజిషన్‌లో కాసేపు నిల్చొనే ప్రయత్నం చేయాలి. దీనిద్వారా మీ కాళ్ల కండరాలు బలంగా మారతాయి.

డెడ్‌లిఫ్ట్‌

ఈ మధ్య కాలంలో క్రికెటర్లలో పిక్క గాయం ఎక్కువగా అవుతోంది. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజురీ అనే పదం తరచూ వింటూనే ఉంటారు కదా. ఈ గాయం కాకుండా ఉండేందుకు ఉపయోగపడేదే ఈ డెడ్‌లిఫ్ట్‌. కాళ్లు దగ్గరగా ఉంచి, రెండు చేతులతో మీ కాళ్లకు కాస్త అటూ ఇటూగా బార్‌ను పట్టుకొని మోకాళ్లను ఆ బార్‌కు దగ్గరగా తీసుకెళ్లేలా వంచాలి. ఆ తర్వాత బార్‌ను మీ తొడల వరకూ ఎత్తి మళ్లీ కింద పెట్టాలి. ఈ సమయంలో మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇది కాలి పిక్కలను బలంగా మార్చుతుంది.

లంజెస్‌

కాళ్లకు బలాన్నిచ్చే కసరత్తుల్లో ఇదీ ఒకటి. ఇంట్లోనే చాలా సులువుగా చేయగలిగే వర్కవుట్‌ ఇది. నిటారుగా నిలబడిన తర్వాత ఈ ఎడమ కాలిని వెనక్కి పెట్టి రెండు మోకాళ్లను వంచాలి. మీ ఎడమ మోకాలు భూమికి కాస్త పైకి ఉండేలా చూసుకోండి. మీ శరీర బరువు కుడి మడమలపై పడేలా మెల్లగా నెట్టండి. ఆ తర్వాత ఇలాగే కుడి కాలిని వెనక్కి పెట్టి చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు పుల్‌ అప్స్‌, చిన్‌-అప్స్‌ వంటి కసరత్తులు కూడా చేస్తే మీ బ్యాక్‌ మజిల్స్‌ దృఢంగా మారతాయి.

తదుపరి వ్యాసం