తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Cricket |క్రికెట్‌పై వచ్చిన బెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ఇవే.. మీకు కచ్చితంగా నచ్చుతాయి!

Cricket |క్రికెట్‌పై వచ్చిన బెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ఇవే.. మీకు కచ్చితంగా నచ్చుతాయి!

Hari Prasad S HT Telugu

24 January 2022, 21:24 IST

google News
    • ఓటీటీలు వచ్చిన తర్వాత గత మూడు, నాలుగేళ్లుగా వెబ్‌సిరీస్‌లకూ డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో మేకర్స్‌ క్రికెట్‌నే ప్రధాన కథాంశంగా వెబ్‌సిరీస్‌ తెరకెక్కించి సక్సెస్‌ సాధిస్తున్నారు.
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియలో వచ్చిన ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ వెబ్‌సిరీస్
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియలో వచ్చిన ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ వెబ్‌సిరీస్ (OTTPLAY)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియలో వచ్చిన ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ వెబ్‌సిరీస్

Cricket.. క్రికెట్‌కు ఇండియాలో ఎప్పటి నుంచో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఓటీటీలు వచ్చిన తర్వాత గత మూడు, నాలుగేళ్లుగా వెబ్‌సిరీస్‌లకూ డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో మేకర్స్‌ క్రికెట్‌నే ప్రధాన కథాంశంగా వెబ్‌సిరీస్‌ తెరకెక్కించి సక్సెస్‌ సాధిస్తున్నారు. ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, జీ5 వంటి ఓటీటీల్లో ప్రస్తుతం ఇలా క్రికెట్‌పై ఉన్న వెబ్‌సిరీస్‌లేంటో ఓసారి చూడండి.

ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో భారతీయ అభిమానుల కోసం రూపొందించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఈ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌. క్రికెట్‌లో దీనికి అర్థం తెలుసు కదా. బ్యాట్స్‌మన్‌ ఓ షాట్‌ కొట్టాలని చూస్తాడు. కానీ బాల్‌ కాస్తా బ్యాట్‌ లోపలి అంచుకు తగిలి వికెట్లను గిరాటేస్తుంది. ఇంచుమించుగా ఇదే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ను రూపొందించారు. ఓ క్రికెట్‌ లీగ్‌, దాని చుట్టూ నడిచే ఫిక్సింగ్‌ దందాయే ఈ సిరీస్‌కు కథా వస్తువు. వివేక్‌ ఒబెరాయ్‌, రిచా చద్దా, సిద్ధాంత్‌ చతుర్వేది, అంగద్‌ బేడీలాంటి వాళ్లు నటించిన ఈ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ రెండు సీజన్లూ సూపర్‌ హిట్టే. 

ఫీల్డ్‌లో జరిగే క్రికెట్‌ కంటే ఎక్కువగా ఫీల్డ్‌ బయట ఆ గేమ్‌ను ఆధారంగా చేసుకొని సాగే ఫిక్సింగ్‌ దందాలు, ఎత్తులు పైఎత్తులతోపాటు వీటిలో ఆటగాళ్లు ఎలా పావులుగా మారతారో కళ్లకు కట్టిన సిరీస్‌ ఇది. క్రికెట్‌ లవర్స్‌కు కచ్చితంగా నచ్చుతుంది. ఇందులోని సీన్స్‌ కొన్ని నిజ జీవితంలో జరిగినవాటిని గుర్తుకు తెస్తాయి. 2021 చివర్లో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ మూడో సీజన్‌ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సెలక్షన్‌ డే

క్రికెట్‌పై రూపొందిన మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌సిరీస్‌ ఇది. ఓ తండ్రి తన ఇద్దరు తనయులను ముంబై అండర్‌ 16 టీమ్‌లోకి పంపడమే లక్ష్యంగా ఎలాంటి అడుగులు వేస్తాడన్నది ఈ సిరీస్‌ చూపిస్తుంది. అయితే ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కావాలనుకుంటాడు. మరొకరికి సైన్స్‌ అంటే ఇష్టమైనా తండ్రి కోరికను గట్టిగా కాదనలేక అలాగే క్రికెట్‌ ఆడుతుంటాడు. ఈ సెలక్షన్‌ డే కూడా రెండు సీజన్లు పూర్తి చేసుకుంది.

రోర్‌ ఆఫ్‌ ఎ లయన్‌

క్రికెట్‌పై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఐపీఎల్‌లోని మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌లో ఒకటైన చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి లీగ్‌లో అడుగుపెట్టిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. 2013లో జరిగిన ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో ఈ టీమ్‌కూ పాత్ర ఉందన్న ఆరోపణలతో రెండేళ్ల పాటు సీఎస్కే టీమ్‌ను నిషేధించిన సంగతి తెలుసు కదా. ఈ ఘటనల గురించి లెజెండరీ ప్లేయర్‌, ఈ టీమ్‌ కెప్టెన్‌ ధోనీ చెప్పిన విషయాలను ఈ డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌ ప్రధానంగా చూపిస్తుంది. రెండేళ్ల నిషేధం తర్వాత వచ్చీరాగానే 2018లో ఆ టీమ్‌ ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.

ద టెస్ట్‌: ఎ న్యూ ఎరా ఫర్‌ ఆస్ట్రేలియాస్‌ టీమ్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఉన్న ఈ క్రికెట్‌ డాక్యు-సిరీస్‌.. బాల్‌ టాంపరింగ్‌ విమర్శల తర్వాత ఆస్ట్రేలియా టీమ్‌ మళ్లీ పునర్‌వైభవం సాధించిన తీరును చూపెడుతుంది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్స్‌ బాల్‌ టాంపరింగ్‌ చేయడం క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం తర్వాత ఆ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్‌ వార్నర్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా నిషేధం కూడా విధించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టిమ్‌ పైన్‌లాంటి యువ క్రికెటర్‌ను కెప్టెన్‌గా నియమించడంతోపాటు జస్టిన్‌ లాంగర్‌ను కోచ్‌గా అపాయింట్ చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి ఆస్ట్రేలియా క్రికెట్‌ మళ్లీ ఎలా గాడిలో పడిందో ఈ డాక్యు-సిరీస్‌ చూపించింది.

లూజర్‌

క్రికెట్‌పై తెలుగులోనూ ఓ వెబ్‌ సిరీస్‌ ఉంది. జీ5 ఓటీటీ.. లూజర్‌ పేరుతో తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌ ప్రధానంగా ఓ షూటర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కినా.. ఇందులో ఓ విఫల క్రికెటర్‌ కథను కూడా జోడించారు. నిజానికి ఇది ఒక ఆంథాలజీ. మూడు విభిన్న కథల కలయిక. ఎన్నో కలలు కని వాటిని సాధించలేకపోయిన ఓ క్రికెటర్‌, ఓ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌తోపాటు ఎన్నో కష్టనష్టాలకోడ్చి అనుకున్నది సాధించిన ఓ షూటర్‌ సక్సెస్‌ స్టోరీయే ఈ లూజర్‌. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు వెబ్‌సిరీస్‌ స్పోర్ట్స్‌పై రూపొందిన బెస్ట్‌ సిరీస్‌లలో ఒకటనడంలో ఎలాంటి సందేహం లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం