తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sports Biopics | బాలీవుడ్‌లో వచ్చిన ఈ స్పోర్ట్స్‌ బయోపిక్స్‌ చూసి తీరాల్సిందే

Sports Biopics | బాలీవుడ్‌లో వచ్చిన ఈ స్పోర్ట్స్‌ బయోపిక్స్‌ చూసి తీరాల్సిందే

Hari Prasad S HT Telugu

24 January 2022, 21:24 IST

google News
    • అథ్లెట్ల జీవితాలను తెరమీద ఆవిష్కరించడం ఈ మూవీ ఇండస్ట్రీలో చాలా కామనే. ఇప్పటికే ఎంతో మంది స్పోర్ట్స్‌ స్టార్ల జీవితాలు సిల్వర్‌స్క్రీన్‌పై మెరిశాయి. ఈ బయోపిక్స్‌ యూత్‌కు ఓ ఇన్‌స్పిరేషన్‌గా పనికొస్తాయి. అసాధారణ ప్రతిభతో ఆకర్షించే ఈ స్టార్ల జీవితంలోని కష్టసుఖాలను తెలుసుకోవాలని ప్రతి అభిమానీ అనుకుంటాడు.
బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ సైనాలో పరిణీతి చోప్రా
బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ సైనాలో పరిణీతి చోప్రా

బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ సైనాలో పరిణీతి చోప్రా

Sports Biopics.. స్పోర్ట్స్‌, సినిమా.. ఈ రెండింటికీ యూత్‌లో మాంచి క్రేజ్‌ ఉంటుంది. ఈ విషయం బాలీవుడ్‌ వాళ్లకు బాగానే తెలుసు. అందుకే సక్సెస్‌ఫుల్‌ అథ్లెట్ల జీవితాలను తెరమీద ఆవిష్కరించడం ఈ మూవీ ఇండస్ట్రీలో చాలా కామనే. ఇప్పటికే ఎంతో మంది స్పోర్ట్స్‌ స్టార్ల జీవితాలు సిల్వర్‌స్క్రీన్‌పై మెరిశాయి. ఈ బయోపిక్స్‌ యూత్‌కు ఓ ఇన్‌స్పిరేషన్‌గా పనికొస్తాయి. స్పోర్ట్స్‌ ఫీల్డ్‌లో తమ అసాధారణ ప్రతిభతో ఆకర్షించే ఈ స్టార్ల నిజ జీవితంలోని కష్టసుఖాలను తెలుసుకోవాలని ప్రతి అభిమానీ అనుకుంటాడు. 

అందులోనూ క్రికెట్‌, ఒలింపిక్స్‌లాంటి వాటిలో మెరిసిన స్టార్లయితే ఆ ఆసక్తి కాస్తా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ పలువురు ప్రముఖ స్పోర్ట్స్‌ పర్సనాలిటీస్‌ బయోపిక్స్‌ తెరకెక్కాయి. వీటిలో కచ్చితంగా చూడాల్సిన బయోపిక్స్‌ ఏంటో ఇప్పుడు చూడండి.

ఎమ్మెస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ

మహేంద్ర సింగ్‌ ధోనీ. అస్సలు పరిచయం అవసరం లేని పేరు. క్రికెట్‌ గురించి ఏమాత్రం తెలియని వాళ్లు కూడా అతని పేరు ఏదో సమయంలో వినే ఉంటారు. ఎక్కడో ఓ చోట అతని ఫొటోలు, వీడియోలు చూసే ఉంటారు. ఇండియన్‌ క్రికెట్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడైన ధోనీపై ది అన్‌టోల్డ్‌ స్టోరీ పేరుతో బాలీవుడ్‌లో మూవీ తెరకెక్కింది. ఊహించినట్లే ఇది అతని క్రికెట్‌ కెరీర్‌లాగే సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టింది. దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ ఈ మూవీలో ధోనీ పాత్రలో జీవించాడు. ధోనీ ఆట గురించి మాత్రమే తెలిసిన అభిమానులకు.. ఈ సినిమా అతని మొత్తం జీవితాన్ని కళ్ల ముందు నిలిపింది. ఇదొక మంచి ఇన్‌స్పిరేషనల్‌ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మేరీ కోమ్‌

భారతదేశ చరిత్రలో అత్యుత్తమ మహిళా బాక్సర్‌. ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌. మహిళల బాక్సింగ్‌లో ఇండియాకు తొలి ఒలింపిక్ మెడల్‌ అందించింది. అమ్మ అయిన తర్వాత కూడా తన పంచ్‌లలో ఏమాత్రం పవర్‌ తగ్గలేదు. ఇవి చాలు కదా మేరీ కోమ్‌ జీవితచరిత్రను ఓ సక్సెస్‌ఫుల్‌ బాలీవుడ్‌ మూవీగా తెరకెక్కించడానికి. ప్రియాంక చోప్రా లీడ్‌ రోల్‌లో ఒమంగ్‌ కుమార్‌ ఇదే ప్రయత్నం చేశారు. అనుకున్నట్లే పెద్ద విజయం సాధించారు. ఈ మూవీలో మేరీ కోమ్‌ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రియాంక చాలానే చెమటోడ్చాల్సి వచ్చింది. నెలల తరబడి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది.

దంగల్‌

ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన స్పోర్ట్స్‌ ఆధారిత మూవీ దంగల్. అంతర్జాతీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ మూవీ. ఇవి చాలు ఈ స్పోర్ట్స్‌ డ్రామా దంగల్‌ మూవీ ఎంతటి విజయం సాధించిందో చెప్పడానికి. ఇండియాకు కామన్వెల్త్‌ గేమ్స్‌ రెజ్లింగ్‌లో తొలి గోల్డ్‌ మెడల్‌ సాధించి పెట్టిన మహిళా రెజ్లర్‌ అయిన గీతా పోఘాట్‌, ఆమె సోదరి బబితా పోఘాట్‌ల స్టోరీయే ఈ మూవీ. ఒకప్పటి గ్రేట్‌ రెజ్లర్‌, వీళ్ల తండ్రి మహావీర్‌ పోఘాట్‌ పాత్రలో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమీర్‌ఖాన్‌ అదరగొట్టాడు. 

ఓ మగ పిల్లాడిని కనాలి. రెజ్లింగ్‌లో తన అంతటి వాడిని చేసి దేశానికి మెడల్‌ సాధించి పెట్టాలి అని మహావీర్ పోఘాట్‌ కలలు కన్నాడు. మగ పిల్లాడు పుట్టాలన్న తన ఆశ నెరవేరలేదు కానీ.. తనకు జన్మించిన నలుగురు ఆడపిల్లల్లో ఇద్దరిని అంతర్జాతీయ రెజ్లర్లు తీర్చిదిద్ది దేశానికి మెడల్స్‌ తీసుకురావడంలో మాత్రం అతడు సక్సెసయ్యాడు. ఈ సక్సెస్‌ఫుల్‌ జర్నీని అంతే ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించిన నితీష్‌ తివారీ.. బాలీవుడ్‌కు అతిపెద్ద హిట్‌ ఇచ్చాడు.

భాగ్‌ మిల్కా భాగ్‌

మిల్కా సింగ్‌.. భారతదేశం గర్వించదగిన అథ్లెట్లలో ఒకరు. కామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, ఒలింపియన్‌, ఓ ఆర్మీ ఆఫీసర్‌. ఈ లెజెండరీ ఇండియన్‌ స్ప్రింటర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ భాగ్‌ మిల్కా భాగ్‌. 2013లో వచ్చిన ఈ మూవీని రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా తెరకెక్కించారు. మిల్కా పాత్రలో పర్హాన్‌ అక్తర్‌ జీవించేశాడు. బాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్‌ బయోపిక్స్‌లో ఇది ముందు వరుసలో ఉంటుంది. మిల్కా జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడానికి పర్హాన్‌ పడిన శ్రమ ఈ మూవీలో కనిపిస్తుంది.

సైనా

బ్యాడ్మింటన్‌లో చైనా గోడను బద్ధలు కొట్టి ఇండియాకు తొలి ఒలింపిక్‌ మెడల్‌ సాధించి పెట్టింది మన హైదరాబాదీ సైనా నెహ్వాల్‌. అన్ని స్పోర్ట్స్‌ బయోపిక్స్‌లాగే ఇందులోనూ సైనా ఈ స్థాయి ఎదగడానికి పడిన కష్టనష్టాలను కళ్లను కట్టినట్లు చూపించడంలో డైరెక్టర్‌ అమోల్‌ గుప్తె సక్సెసయ్యారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆటలెందుకు అనే ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన మూవీ ఇది. బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా.. సైనా పాత్రలో కనిపించింది.

పాన్‌సింగ్‌ తోమార్‌

కుటుంబ తగాదాలతో దోపిడీ దొంగగా మారిన ఓ స్టీపుల్‌చేజ్‌ అథ్లెట్‌ జీవితమే ఈ పాన్‌సింగ్‌ తోమార్‌. బాలీవుడ్‌ బెస్ట్‌ స్పోర్ట్స్‌ బయోపిక్స్‌లో ఇదీ ఒకటి. దివంగత ఇర్ఫాన్‌ఖాన్‌ ఈ మూవీని ఒంటిచేత్తో నడిపించేశాడు. విలక్షణ నటనతో మెప్పించే ఇర్ఫాన్‌.. పాన్‌సింగ్‌ పాత్రలో ఒదిగిపోయాడు.

ఇవే కాకుండా హాకీ ప్లేయర్‌ సందీప్‌ సింగ్‌పై వచ్చిన సూర్మా, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన అజర్‌, పరుగుల బుడతడు బుధియాపై వచ్చిన బుధియా సింగ్‌-బార్న్‌ టు రన్‌ బయోపిక్స్‌ కూడా చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం