తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Auction | అసలు వేలం ఆలోచన ఎవరిది? ప్లేయర్స్‌కు మొత్తం డబ్బు ఇస్తారా?

IPL Auction | అసలు వేలం ఆలోచన ఎవరిది? ప్లేయర్స్‌కు మొత్తం డబ్బు ఇస్తారా?

Hari Prasad S HT Telugu

09 February 2022, 12:10 IST

google News
    • అంగట్లో ప్లేయర్స్‌ను పెట్టి ఎవరు ఎక్కువకు పాడితే వాళ్లకు ఆ ప్లేయర్‌ను ఇవ్వడం అన్న కాన్సెప్ట్‌ చాలా కొత్తగా, వింతగా.. మరికొందరికి చాలా చెత్తగా కూడా అనిపించింది. వేలంపై విమర్శలు వచ్చినా.. మెజార్టీ క్రికెట్‌ అభిమానులు మాత్రం వేలాన్ని ఆహ్వానించినట్లు వాటికి వచ్చిన టీవీ రేటింగ్స్‌ను బట్టి స్పష్టమవుతోంది.
ఐపీఎల్ ట్రోఫీ
ఐపీఎల్ ట్రోఫీ (ANI)

ఐపీఎల్ ట్రోఫీ

IPL Auction | అసలు ఈ టోర్నీ ప్రారంభమైనప్పుడు ప్రీమియర్ లీగ్ కాన్సెప్టే మనకు కొత్త. అలాంటిది ఐపీఎల్‌లో ఆటగాళ్ల వేలం అంటే అందరూ చాలా వింతగా చూశారు. స్టార్‌ స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను సొంతం చేసుకున్న తర్వాత జరిగిన తొలి మెగా వేలాన్ని సుమారు 5 కోట్ల మంది చూడటం విశేషం.

అసలు ఈ ఐపీఎల్‌లో ప్లేయర్స్‌ వేలం కాన్సెప్ట్‌ ఎలా వచ్చింది? వేలంలో ప్లేయర్స్‌ పలికే ధర ఎంత? ఆ మొత్తం వాళ్లకు అందుతుందా? విదేశీ ప్లేయర్స్‌ను ఐపీఎల్‌కు పంపడం వల్ల ఆయా బోర్డులకు వచ్చే లాభమేంటి? అన్న ఆసక్తికర విషయాలు మీకోసం.

IPL Auction.. ఎవరి ఐడియా?

మరి గతంలో ఎక్కడా చూడని ఇలాంటి వింత వేలం కాన్సెప్ట్‌ ( IPL Auction ) ఎలా వచ్చిందన్న అనుమానం చాలా మందికి కలిగే ఉంటుంది. తొలిసారి 2008లో ఐపీఎల్‌ జరగగా.. అంతకుముందు మెగా ప్లేయర్స్‌ వేలం జరిగింది. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందన్నది గతంలో ఐపీఎల్‌ చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న సుందర్‌ రామన్‌ వివరించారు. ఆయన ప్రకారం.. ఈ వినూత్న కాన్సెప్ట్‌ ఓ ఫ్రాంఛైజీ ఓనర్‌ ప్రతిపాదన నుంచి వచ్చింది. 

ఆ ఓనర్‌ ఓవరో సరిగ్గా గుర్తు లేదు కానీ.. ప్లేయర్స్‌ను టీమ్స్‌కు ఎలా కేటాయించాలన్న సందేహం వచ్చినప్పుడు ఆ వ్యక్తి వేలం ద్వారా ఇస్తే ఎలా ఉంటుందని అని ప్రతిపాదించారు. దీనిపై కేవలం రెండు నిమిషాల పాటు చర్చించి, ఇది చాలా బాగుంటుందని అందరం నిర్ణయించినట్లు సుందర్‌ రామన్‌ గతంలో ఒకసారి వెల్లడించారు. ‘ఫ్రాంఛైజీలను అమ్మేశాం. టోర్నీ ప్రారంభమయ్యే డేట్‌ కూడా చెప్పేశాం. కానీ ప్లేయర్స్‌ను ఆయా టీమ్స్‌కు ఎలా ఇవ్వాలో అంతుబట్టలేదు. ఐకాన్‌ ప్లేయర్స్‌ పేరుతో ముంబైకి సచిన్‌ను, పంజాబ్‌కు యువరాజ్‌ను, ఢిల్లీకి సెహ్వాగ్‌ను ఇచ్చేశాం. 

మరి మిగతా ప్లేయర్స్‌ సంగతేంటి అని ఆలోచిస్తున్న సమయంలో ఎవరో ఒక ఫ్రాంఛైజీకి చెందిన వ్యక్తి ఈ వేలం కాన్సెప్ట్‌ను ప్రతిపాదించారు’ అని సుందర్‌ వివరించారు. ఈ వేలం అనేది అభిమానుల్లో చాలా ఆసక్తి కలిగిస్తుందని వాళ్లు భావించినట్లే.. తొలి మెగా వేలమే పెద్ద సక్సెసైంది. వేలాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేయాలన్న నిర్ణయం కూడా వారికి కలిసి వచ్చింది. మొదట్లో డాలర్లలో ప్లేయర్స్‌ వేలం జరిగినా.. 2012 నుంచి మన కరెన్సీలోనే నిర్వహిస్తున్నారు.

IPL Auction.. ఎలా పనిచేస్తుంది?

ఈ IPL Auctionలో ప్రతి ప్లేయర్‌కు కనీస ధర ఉంటుందన్న విషయం తెలుసు కదా. ఈ కనీస ధర రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకూ ఉంటుంది. ఈ బేస్‌ ప్రైస్‌ను నిర్ణయించుకొనే అవకాశం సదరు ప్లేయర్‌కే ఉంటుంది. ఆ ప్లేయర్‌ కావాలంటే తగ్గించుకోవచ్చు లేదంటే పెంచుకోవచ్చు.

- వేలంలో ప్లేయర్‌ను ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ధరే అతని జీతం అవుతుంది. అందులో నిబంధనల ప్రకారం పన్నులు పోను.. మిగతా మొత్తం ప్లేయర్‌కు అందుతుంది. అతని జీతంలో మిగతా ఎవరికీ ఏ వాటా ఉండదు.

- ప్లేయర్‌ జీతం ఒక సీజన్‌కు సంబంధించింది. అంటే ఓ ప్లేయర్‌ను రూ. 5 కోట్లకు కొన్నారంటే.. ఒక సీజన్ ఆడితే వచ్చే మొత్తం అది. ఒకవేళ మూడు సీజన్లకు కాంట్రాక్ట్‌ ఉంటే.. రూ. 15 కోట్లు ఆ ప్లేయర్‌కు దక్కుతాయి.

- తర్వాత సీజన్‌ను కూడా ప్లేయర్‌ను కొనసాగించాలనుకుంటే.. సదరు ఫ్రాంఛైజీ ఆ ప్లేయర్‌ జీతం కంటే తక్కువకు కాంట్రాక్ట్‌ కుదర్చుకునే వీలుండదు. కావాలంటే పెంచుకోవచ్చు.

- ప్లేయర్‌ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉంటే.. మ్యాచ్‌లలో ఆడినా, ఆడకపోయినా జీతం మొత్తం అందుతుంది. అలా కాకుండా సీజన్‌కు ముందు గాయపడి, టోర్నీ మొత్తానికి దూరమైతే ఎలాంటి జీతం దక్కదు. ఒకవేళ మధ్యలో గాయడిపతే.. అందుబాటులో ఉన్న మ్యాచ్‌లను బట్టి జీతం ఇస్తారు.

ఆ బోర్డులకు వచ్చే లాభమేంటి?

- ఓ విదేశీ ప్లేయర్‌ను ఐపీఎల్‌కు పంపిస్తే.. సదరు బోర్డుకు వచ్చే లాభమేంటి అన్న డౌట్‌ మీకు రావచ్చు. ఒకవేళ ఓ విదేశీ ఆటగాడిని ఓ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే.. అందులో 20 శాతం సదరు బోర్డుకు బీసీసీఐ చెల్లిస్తుంది. ఒకవేళ రూ. 10 కోట్లకు ఓ ప్లేయర్‌ను కొంటే.. అందులో 20 శాతం అంటే రూ. 2 కోట్లు సదరు క్రికెట్‌ బోర్డుకు దక్కుతాయి. ఈ మొత్తాన్ని ఐపీఎల్‌ ఆదాయం నుంచి ఇస్తారు.

- ఇక ప్లేయర్‌కు జీతం ఎప్పుడు ఇస్తారన్నది కూడా ఫ్రాంచైజీని బట్టి మారుతుంది. కొన్ని ఫ్రాంఛైజీలు సీజన్‌ ప్రారంభంలో క్యాంప్‌ ప్రారంభమైన సమయంలోనే ప్లేయర్స్‌కు మొత్తం జీతం చెక్కులను ఇస్తారు. మరికొన్ని మొదట 50 శాతం, టోర్నీ జరుగుతున్న సమయంలో మిగతా మొత్తం ఇస్తాయి. ఇంకొన్ని ఫ్రాంఛైజీలు లీగ్‌ ప్రారంభానికి ముందు 15 శాతం, లీగ్ జరిగే సమయంలో 65 శాతం, ముగిసిన తర్వాత మిగిలిన 20 శాతం చెల్లిస్తాయి.

తదుపరి వ్యాసం