IPL Franchisee: ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు డబ్బు ఎలా వస్తుంది?
29 March 2023, 19:29 IST
- IPL Franchisee: ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు డబ్బు ఎలా వస్తుంది? వేల కోట్లు పెట్టి టీమ్‌లను కొన్న ఈ ఫ్రాంఛైజీలే వేలంలో కోట్లు పెట్టి మళ్లీ ఆటగాళ్లనూ కొంటాయి. ఫ్రాంఛైజీలకు ఆ డబ్బు తిరిగి ఎలా వస్తుంది?
ఐపీఎల్ 2022 ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ టీమ్
IPL Franchisee: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే అంతా డబ్బు మయం. క్రికెట్‌ను పక్కా బిజినెస్‌గా మార్చేసిన లీగ్ ఇది. ఈ ఆటపై భారతీయులకు ఉన్న మోజునే పెట్టుబడిగా చేసుకొని ప్రారంభమైన ఈ లీగ్.. ఇటు అభిమానులకు వినోదాన్ని పంచుతూనే, అటు క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపిస్తోంది. 16 ఏళ్లుగా ఎండాకాలం సాయంత్రాలు క్రికెట్ అభిమానులు చల్లగా గడిపేస్తున్నారు.
అయితే వేల కోట్లు పెట్టి టీమ్‌లను కొన్న లీగ్ లోని ఫ్రాంఛైజీలకు ఆ డబ్బు తిరిగి ఎలా వస్తుందన్న సందేహం అభిమానులకు ఉంటుంది. మరి ఇన్ని వేల కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్న ఫ్రాంఛైజీలకు ఆ డబ్బు తిరిగి ఎలా వస్తుంది? ఐపీఎల్‌లో వాళ్ల సంపాదన మార్గాలు ఏంటి?
మీడియా హక్కులు
ఐపీఎల్, బీసీసీఐ, ఫ్రాంఛైజీలు.. అందరికీ ప్రధాన ఆదాయ వనరు ఈ మీడియా హక్కులే. భారీ మొత్తాలకు బ్రాడ్‌కాస్టర్లకు హక్కులను విక్రయిస్తుంది బీసీసీఐ. మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐకి ఏకంగా రూ.48390 కోట్లు వచ్చాయంటే ఈ లీగ్ పవరేంటో అర్థం చేసుకోవచ్చు.
ఐదేళ్ల కిందట 2017-22 మధ్య ఐదేళ్ల కాలానికి డిస్నీ స్టార్ టీవీ, డిజిటల్ హక్కుల కోసం చెల్లించిన మొత్తం రూ.16348 కోట్లు మాత్రమే. ఆ లెక్కన ఇప్పుడు ఆ మొత్తం సుమారు మూడు రెట్లు పెరిగింది. ఈ డబ్బులో తన వాటా తీసుకున్న తర్వాత మిగిలిన మొత్తాన్ని ఫ్రాంఛైజీలన్నింటికీ సమానంగా పంచుతుంది. ఫ్రాంఛైజీల ప్రధాన ఆదాయ వనరుల్లో మీడియా హక్కులు ముఖ్యమైనది.
స్పాన్సర్‌షిప్
ఇక ఫ్రాంఛైజీలకు ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చేది ఈ స్పాన్సర్‌షిప్‌ల ద్వారానే. ఒక్కసారి మీరు ఏ ఐపీఎల్ టీమ్ జెర్సీని చూసినా ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రతి టీమ్ జెర్సీపై ఏమాత్రం ఖాళీ లేకుండా ఏదో ఒక లోగో కనిపిస్తూనే ఉంటుంది. ఒక ప్రధాన స్పాన్సర్.. అంటే జెర్సీ మధ్యలో పెద్దగా కనిపించే లోగో. ఇక జెర్సీ వెనుక, చేతులు, భుజాలపై, హెల్మెట్‌పై.. ఇలా ఏదో బ్రాండ్‌కు సంబంధించిన లోగో ఉంటుంది.
ఈ లోగోలు ఎంత స్పష్టంగా, పెద్దగా కనిపిస్తే అంత ఎక్కువ డబ్బులు ఫ్రాంఛైజీలకు వస్తాయి. ఇక హోమ్ గ్రౌండ్‌లో ఆడే సమయంలో బౌండరీ లైన్ బయట కూడా మీకు ఎన్నో యాడ్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ కారణంగా బ్రాండ్లు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి భారీ ఎత్తున ఫ్రాంఛైజీలకు డబ్బులు చెల్లిస్తుంటాయి. ఐపీఎల్‌లో టీమ్ ఎంత సక్సెసైతే ఆ టీమ్ ఆదరణ అంత పెరుగుతుంది. అందుకు తగినట్లే మరిన్ని ఎక్కువ స్పాన్సర్‌షిప్స్ వస్తుంటాయి.
మర్చండైజ్ అమ్మకాలు
తమ ఫేవరెట్ ప్లేయర్స్ వేసుకునే జెర్సీలు, టోపీలు వంటి తామూ వేసుకోవాలని చాలా మంది ఫ్యాన్స్ ఉబలాటపడుతుంటారు. ఇదే ఫ్రాంఛైజీలకు మరో ఆదాయ వనరు. తమ టీమ్స్ జెర్సీలు, టోపీలు వంటి వాటిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టి భారీగా సంపాదిస్తుంటాయి ఆయా ఫ్రాంఛైజీలు.
టికెట్ అమ్మకాలు
ఇక హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరిగినప్పుడు టికెట్ల అమ్మకాల ద్వారా కూడా కొంత సొమ్ము ఫ్రాంచైజీలకు వస్తుంది. ఆయా క్రికెట్ అసోసియేషన్‌లు నిర్వహించే గ్రౌండ్ల కోసం అద్దె చెల్లించి మ్యాచ్‌ల కోసం ఫ్రాంచైజీలు వినియోగించుకుంటాయి. దీంతో టికెట్ల అమ్మకాలలో మెజార్టీ వాటా ఫ్రాంచైజీలదే. వాళ్ల మొత్తం ఆదాయంలో 15 శాతం ఈ టికెట్ల అమ్మకాల నుంచి వచ్చేదే కావడం విశేషం.
ఐపీఎల్ ప్రైజ్‌మనీ
ఐపీఎల్‌లో టీమ్ నిలిచిన ర్యాంకులను బట్టి ప్రైజ్‌మనీ ఉంటుంది. ఉదాహరణకు మొన్నటి ఐపీఎల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది కదా. దీంతో ఆ టీమ్‌కు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. అందులో 50 శాతం కచ్చితంగా ప్లేయర్స్‌కు ఇవ్వాలన్న నిబంధన ఉంది. అది పోను మిగిలిన మొత్తం ఫ్రాంఛైజీలకే చెందుతుంది.
బ్రాండ్ వాల్యూ
ఫ్రాంఛైజీల సంపాదనలో ఈ బ్రాండ్ వాల్యూ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టీమ్‌లో ఎంత మంది స్టార్ ప్లేయర్స్ ఉంటే ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ అంత పెరుగుతుంది. ఉదాహరణకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. దీంతో ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ భారీగా ఉంటుంది. గతేడాది వరకూ పోలిస్తే రూ. 761 కోట్లతో ముంబై ఇండియన్స్ టాప్ బ్రాండ్ వాల్యూ ఉన్న టీమ్‌గా నిలిచింది. అందుకే వేలంలో స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడుతుంటాయి. లీగ్‌లో బాగా రాణించే టీమ్స్ విలువ పెరుగుతూనే ఉంటుంది.
వాటాలు అమ్మడం
ఫ్రాంచైజీలు తమ టీమ్‌లో కొద్దిపాటి వాటాలు అమ్మడం ద్వారా కూడా భారీగా సంపాదిస్తాయి. ఈ మధ్యే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో 50 శాతం వాటాను జిందాల్ సౌత్ వెస్ట్ సంస్థ 7.7 కోట్ల డాలర్లు చెల్లించి సొంతం చేసుకుంది. 2008లో ఈ టీమ్‌ను జీఎంఆర్ గ్రూపు 8.4 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.