Harry Brook Record: 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. రికార్డులు బ్రేక్ చేసిన హ్యారీ బ్రూక్
24 February 2023, 16:02 IST
- Harry Brook Record: 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. రికార్డులు బ్రేక్ చేశాడు ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో బ్రూక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్
Harry Brook Record: ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టెస్ట్ క్రికెట్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. అతడు ఇంగ్లండ్ తరఫున టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచీ రికార్డులు బ్రేకవుతూనే ఉన్నాయి. ధాటిగా ఆడుతూనే భారీ స్కోర్లు చేయడం అలవాటుగా మార్చుకున్న బ్రూక్.. తాజాగా న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ తొలి రోజు ఆటలో కేవలం 169 బంతుల్లోనే 184 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో అతడు 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్ తన తొలి 9 టెస్ట్ ఇన్నింగ్స్ లో 807 పరుగులు చేశాడు. ఇప్పటికీ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అతడు నాటౌట్ గానే ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ లో ఇప్పటివరకూ ఏ ఇతర బ్యాటర్ తన తొలి 9 టెస్ట్ ఇన్నింగ్స్ లో ఇన్ని పరుగులు చేయలేదు.
ఇంతకాలం ఈ రికార్డు ఇండియాకు చెందిన వినోద్ కాంబ్లి పేరిట ఉండేది. కాంబ్లి తన తొలి 9 టెస్ట్ ఇన్నింగ్స్ లో 798 రన్స్ చేశాడు. కాంబ్లి రికార్డుతోపాటు హెర్బెర్ట్ సట్‌క్లిఫ్ (780 రన్స్), సునీల్ గవాస్కర్ (777)లను కూడా బ్రూక్ అధిగమించాడు. ఇంగ్లండ్ తరఫున టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచీ బ్రూక్ చెలరేగుతూనే ఉన్నాడు.
బ్రూక్ 2022, సెప్టెంబర్ 8న సౌతాఫ్రికాపై టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 12 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఆ తర్వాత పాకిస్థాన్ టూర్ లో అతని దశ తిరిగిపోయింది. అక్కడ ఆడిన తొలి టెస్ట్ లోనే 153, 87 రన్స్ చేశాడు. ఆ తర్వాత రెండు, మూడు టెస్టుల్లోనూ మరో రెండు సెంచరీలు చేయడం విశేషం.
ఇక న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ లో 89, 54 రన్స్ చేయగా.. ఇప్పుడు రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 184 రన్స్ చేసి అజేయంగా ఉన్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్ తొలి 9 ఇన్నింగ్స్ లో కలిపి ఇప్పటి వరకూ బ్రూక్ రన్స్ 807కు చేరింది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రూక్.. న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగి తన టీమ్ ను పటిష్టమైన స్థితిలో నిలిపాడు.