తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya About His Return: కెరీర్‌లో మంచి, చెడు రెండూ అనుభవించా.. జట్టులో పునరాగమనంపై పాండ్య స్పందన

Hardik Pandya about his Return: కెరీర్‌లో మంచి, చెడు రెండూ అనుభవించా.. జట్టులో పునరాగమనంపై పాండ్య స్పందన

20 October 2022, 19:38 IST

google News
    • Hardik Pandya about his Return: ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో హార్దిక్ పాండ్య ఎంతో కీలకమైన ఆటగాడు. వెన్ను గాయంతో గతేడాది జట్టు నుంచి దూరమైన అతడు కోలుకుని అదిరిపోయే ప్రదర్శనతో తిరిగి టీమ్‌లోకి అరంగేట్రం చేశాడు. దీనిపై అతడు స్పందించాడు.
హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (AFP)

హార్దిక్ పాండ్య

Hardik Pandya about his Return: టీ20 ప్రపంచకప్‌ 2022 సమరానికి రంగం సిద్ధమైంది. మెల్‌బోర్న్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. బుమ్రా లాంటి స్టార్ పేసర్ అందుబాటులో లేనప్పటికీ అనభవజ్ఞులతో పాటు మెరుగైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. గతేడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌నకు దూరమైన హార్దిక్ పాండ్య ఈ సారి అద్భుతమైన ఫామ్‍‌తో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడు.. ఆ సమస్య నుంచి కోలుకోవడమే కాకుండా.. అద్భుత ప్రదర్శనతో ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఐపీఎల్ మొదలుకుని కీలక సిరీస్‌లో మెరుగ్గా రాణించాడు. ఈ నేపథ్యంలో తన పునరాగమనం గురించి వివరించాడు.

"ప్రారంభం నుంచి మొదలు పెట్టేందుకు, ప్రతి దాన్నీ సానుకూలంగా తీసుకోవడానికి నాకు నేను సహాయం చేసుకోవడం చాలా అవసరమనిపించింది. అలాగే చేశాను. అందువల్ల నేను ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించి జీవితంలో శాంతిని పొందాను. మంచి రోజులు, చెడు రోజులు రెండూ వస్తాయని నాకు ముందే తెలుసు. నేను పడిన కష్టాన్ని బట్టి పాజిటివిటీ వస్తుంది. అది నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అలాగే నా కుటుంబం ఎల్లప్పుడూ నాకు వెన్నదన్నుగా నిలిచింది. ఫలితంగా నేను ఏకాగ్రతతో ఉండటమే కాకుండా.. సానుకూలంగా ఆలోచించగలిగాను" అని హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు.

జట్టులో తన పునరాగమనంలో కుటుంబం ఎంతో పాత్ర పోషించిందని పాండ్య తెలిపాడు. "నన్ను నేనుగా ఉండనివ్వడంలో నా కుటుంబం పెద్ద పాత్ర పోషించింది. అన్నింటికంటే ఎక్కువగా నా కోసం నేను ఏమి కోరుకుంటున్నానో గ్రహించి కొంత సమయాన్ని కేటాయించగలిగాను. ఇందులో నా కుటుంబం నాకు ఇచ్చిన మద్దతు కారణంగా ఈ విధంగా ఉండగలిగాను." అంటూ పాండ్య అన్నాడు.

గతేడాది వెన్నుగాయంతో జట్టుకు దూరమైన అతడు.. కోలుకుని తిరిగి ఫామ్ పుంజుకున్నాడు. ఫలితంగా జట్టులోకి మళ్లీ రీ ఎంట్రీ చేశాడు. పునరాగమనం చేసినప్పటి నుంచి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సమయంలో పాండ్య టీ20ల్లో 36.33 సగటుతో 151.38 స్ట్రైక్ రేటుతో 436 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ మెరుగ్గా రాణించాడు. అతడు 12 వికెట్లు తీశాడు. మొత్తంగా 74 టీ20ల్లో పాండ్య 989 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. మరో 11 పరుగులు చేస్తే.. పాండ్య వెయ్యి పరుగుల క్లబ్‌లో అడుగుపెడతాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లోనే ఈ మైలురాయి సాధించే అవకాశముంది.

తదుపరి వ్యాసం