Harbhajan on Deepak Chahar: భువనేశ్వర్ కంటే చహర్ బెస్ట్: హర్భజన్
07 October 2022, 15:23 IST
Harbhajan on Deepak Chahar: భువనేశ్వర్ కుమార్ కంటే దీపక్ చహరే బెటరంటున్నాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. దీనికి అతడు ఓ బలమైన కారణమే చెబుతున్నాడు.
దీపక్ చహర్, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్
Harbhajan on Deepak Chahar: టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లింది. ఓవైపు గాయపడిన బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకోవాలి అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇండియన్ టీమ్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం ఈ బుమ్రా చర్చలోకి వెళ్లకుండా భువనేశ్వర్, దీపక్ చహర్‌లో ఎవరు బెటర్ అన్నదానిపై స్పందించాడు.
నిజానికి భువనేశ్వర్ ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగిస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇస్తూ మ్యాచ్‌లు చేజారేలా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సీనియర్ అయిన భువీ కంటే బాల్‌ను రెండు వైపులా స్వింగ్ చేసే దీపక్ చహరే బెటరని భజ్జీ అభిప్రాయపడ్డాడు. అతడు పవర్ ప్లేలలో 2,3 వికెట్లు తీసుకోగలడని చెప్పాడు.
"ప్రస్తుతం మొదట్లోనే, బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ పవర్ ప్లేలో 2,3 వికెట్లు తీయగల ఏకైక బౌలర్ దీపక్ చహరే. అతని ఔట్‌స్వింగ్‌లాగే ఇన్‌స్వింగ్ కూడా చాలా పవర్‌ఫుల్. పరిస్థితులు స్వింగ్‌కు అనుకూలించకపోయినా అతడు బంతిని మూవ్ చేయగలడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భువనేశ్వర్‌తో పోలిస్తే దీపక్ ఇంకా మంచి నైపుణ్యం ఉన్న బౌలర్" అని హర్భజన్ అన్నాడు.
ఇక ఆసియాకప్‌లో, ఆస్ట్రేలియాతో సిరీస్‌లో డెత్ ఓవర్లలో భువనేశ్వర్ భారీగా పరుగులు లీక్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. "భువికి చాలా అనుభవం ఉంది. అతడు మ్యాచ్‌లనూ గెలిపించగలడు. అయితే 19వ ఓవర్లో 8-10 పరుగుల వరకూ ఓకే కానీ.. 15 అంతకన్నా ఎక్కువ సమర్పించుకుంటే మ్యాచ్ ఓడిపోతాము. అందుకే నా ఛాయిస్ దీపకే" అని హర్భజన్ తేల్చి చెప్పాడు.
ఇక డెత్ ఓవర్లలో ఫర్వాలేదనిపిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌పై కూడా హర్భజన్ స్పందించాడు. అయితే అతడు ఇప్పుడిప్పుడే మెరగవుతున్నాడని, మన ప్లాన్స్ ప్రకారం అతడు నిలకడగా రాణించాలని ఆశించలేమని అన్నాడు.
"అర్ష్‌కు మంచి టాలెంట్ ఉంది. భవిష్యత్తు బౌలర్. ఇక లెఫ్టామ్ సీమ్ బౌలర్‌గా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే లైన్స్‌లో కూడా బౌలింగ్ చేయొచ్చు. అయితే అతనికి పిచ్ నుంచి కూడా కాస్త సహకారం కావాలి. ఇక అతడు ఇప్పుడిప్పుడే టీమ్‌లోకి వచ్చాడు. చాలా ఒత్తిడి ఉండే పరిస్థితుల్లో బౌలింగ్ చేయాల్సి ఉంది. ఒత్తిడిలో అతడు ఆరు బాల్స్‌ను ప్లాన్ ప్రకారం వేస్తాడని ఆశించడం సరికాదు. ఓ సీనియర్ బౌలర్ అతనికి తోడుగా ఉంటే మరింత మెరుగ్గా రాణించగలడు" అని హర్భజన్ అన్నాడు.