Team India flies to Australia: టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా బయలుదేరిన టీమిండియా
Team India flies to Australia: టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది టీమిండియా. గురువారం(అక్టోబర్ 6) తెల్లవారుఝామున ముంబైలో ఫ్లైటెక్కింది. ఈ ఫొటోలను బీసీసీఐ, కోహ్లి, సూర్యకుమార్ షేర్ చేసుకున్నారు.
Team India flies to Australia: టీమిండియా మరో టీ20 వరల్డ్‌కప్ వేటలో ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. ఓవైపు యంగిండియా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే వరల్డ్‌కప్ ఆడే టీమ్ గురువారం (అక్టోబర్ 6) తెల్లవారుఝామునే వెళ్లిపోవడం విశేషం. 15 మంది సభ్యుల టీమ్ వెళ్లాల్సి ఉన్నా.. బుమ్రా దూరం కావడం, అతని స్థానంలో ఇంకా ఎవరినీ తీసుకోకపోవడంతో 14 మందే ఆస్ట్రేలియాకు వెళ్లారు.
ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాతే అక్కడి పరిస్థితులను బట్టి బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకోవాలో నిర్ణయిస్తామని కెప్టెన్ రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే. టీమిండియా ఆస్ట్రేలియా బయలుదేరే ముందు గ్రూప్ ఫొటో దిగింది. ఈ ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. "పిక్చర్ పర్ఫెక్ట్. మనం సాధిద్దాం టీమిండియా. వరల్డ్‌కప్, వచ్చేస్తున్నాం" అని బీసీసీఐ ఈ ఫొటోకు క్యాప్షన్ ఉంచింది.
ఇక టీమ్ ఫ్లైట్ ఎక్కే ముందు ఇండియన్ క్రికెటర్లు కూడా గ్రూపులుగా ఫొటోలు దిగారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా హర్షల్ పటేల్, యుజువేంద్ర చహల్‌లతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. "ఆస్ట్రేలియా వెళ్తున్నాం. ఉత్సాహకరమైన రోజులు ముందున్నాయి" అంటూ చహల్, హర్షల్‌లను ట్యాగ్ చేశాడు విరాట్ కోహ్లి.
ఇక స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో కెప్టెన్ రోహిత్‌శర్మ, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ ఎంతో కాన్ఫిడెంట్‌గా స్మైల్ ఇస్తూ కెమెరాకు పోజులిచ్చారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై మూడేసి టీ20ల సిరీస్‌లను 2-1తో గెలిచిన ఇండియన్ టీమ్ కాన్ఫిడెంట్‌గా టీ20 వరల్డ్‌కప్‌లో అడుగుపెడుతోంది.
అయితే గతేడాది వరల్డ్‌కప్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం, బుమ్రా, రవీంద్ర జడేజాలాంటి స్టార్ ప్లేయర్స్ టోర్నీకి దూరం కావడంలాంటివి కూడా టీమ్‌ను వేధిస్తున్నాయి. జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్ తన నిలకడైన ప్రదర్శనతో భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నా.. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడమే మేనేజ్‌మెంట్‌కు అంత సులువైన పనిలా కనపించడం లేదు.
ఈ ఏడాది వరల్డ్‌కప్ వేటను పాకిస్థాన్‌తో మ్యాచ్‌తోనే ఇండియన్ టీమ్ ప్రారంభించనుంది. అక్టోబర్ 23న ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ దాయాదుల మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అంతకుముందు వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వామప్ మ్యాచ్‌లు ఆడనుంది.