Kohli Selfless Gesture: హాఫ్ సెంచరీని త్యాగం చేసిన కోహ్లి - ఆటతీరుకు ఫ్యాన్స్ ఫిదా
Virat Kohli Selfless Gesture: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో కోహ్లి నిలిచిపోయాడు. యాభై పరుగులు పూర్తిచేసుకునే అవకాశం ఉండి కూడా జట్టు కోసం త్యాగం చేశాడు. అతడి ఆటతీరుకు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు.
Virat Kohli Selfless Gesture: ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో పదహారు పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై టీమ్ ఇండియా విజయాన్ని సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav), కె.ఎల్ రాహుల్ (Klrahul) హాఫ్ సెంచరీలతో మెరవగా కోహ్లి, రోహిత్ కూడా చక్కటి బ్యాటింగ్‌తో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో 49 పరుగులతో కోహ్లి నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఆగిపోయాడు.
అర్ధ శతకం చేసే అవకాశం ఉన్నా కూడా జట్టు భారీ స్కోరు సాధించడానికే కోహ్లి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 19వ ఓవర్ ముగిసిలోగా కోహ్లి 49 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. చివరి ఓవర్ లో కార్తిక్ కు స్ట్రైకింగ్ దక్కింది. ఆ ఓవర్‌లో మొదటి బాల్‌ను డాట్‌గా వదిలిపెట్టిన కార్తిక్ రెండో బాల్‌కు ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత నాలుగో బాల్‌ను సిక్స్‌గా మలిచాడు. వెంటనే కోహ్లి వద్దకు వెళ్లిన కార్తిక్ సింగిల్ తీస్తానని, హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోమని ఆడిగినట్లుగా కనిపించింది. కానీ కోహ్లి మాత్రం అతడినే బ్యాటింగ్ చేయమని చెప్పాడు.
ఐదో బాల్‌ను కార్తిక్ సిక్స్‌గా మలిచాడు. జట్టు కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన కోహ్లి క్రికెట్ అభిమానుల మనసుల్ని గెలచుకున్నాడు. కోహ్లి, కార్తిక్ మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సొంత రికార్డుల కంటే టీమ్ గెలుపు కోసమే కోహ్లి ఎప్పుడూ ఆడుతాడంటూ అతడిపై అభిమానులు ప్రశంసల్ని కురిపిస్తున్నారు. ఈ టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా కూడా గట్టిగానే పోరాడింది. డేవిడ్ మిల్లర్, డికాక్ రాణించడంతో గెలుపు వరకు వచ్చింది. కానీ రన్‌రేట్ భారీగా ఉండటంతో ఓటమిపాలైంది.
.