Australia Team for T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా టీమ్‌లో సింగపూర్‌ క్రికెటర్‌-australia team for t20 world cup announced as singapore cricketer tim david makes the cut ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australia Team For T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా టీమ్‌లో సింగపూర్‌ క్రికెటర్‌

Australia Team for T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా టీమ్‌లో సింగపూర్‌ క్రికెటర్‌

Hari Prasad S HT Telugu
Sep 01, 2022 08:48 AM IST

Australia Team for T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా టీమ్‌లో సింగపూర్‌ క్రికెటర్‌కు చోటు దక్కడం విశేషం. అదే సమయంలో ఇండియా టూర్‌కు రానున్న టీమ్‌ నుంచి డేవిడ్‌ వార్నర్‌కు రెస్ట్‌ ఇచ్చారు.

<p>సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్</p>
<p>సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్</p> (AP)

Australia Team for T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియా అప్పుడే తమ 15 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించేసింది. అయితే ఇందులో సింగపూర్‌ క్రికెటర్‌ టిమ్‌ డేవిడ్‌కు చోటివ్వడం విశేషం. అతన్ని ప్రాబబుల్స్‌లోకి తీసుకోబోతున్నట్లు చాలా రోజుల కిందటే ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ వెల్లడించాడు.

ఇప్పుడు ఏకంగా 15 మంది సభ్యుల టీమ్‌లోనూ అతడు చోటు సంపాదించాడు. టీమ్‌ ఎంపిక గురించి గురువారం (సెప్టెంబర్‌ 1) క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో సమాచారం అందించింది. అలాగే సెప్టెంబర్‌ 20 నుంచి ఇండియాతో జరగబోయే 3 టీ20ల సిరీస్‌కు కూడా టీమ్‌ను ప్రకటించారు. అయితే ఈ సిరీస్‌ నుంచి స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు రెస్ట్‌ ఇచ్చారు. ఇండియా టూర్‌కు మాత్రం వార్నర్‌ స్థానంలో కేమరూన్‌ గ్రీన్‌ ఉంటాడు.

టిమ్‌ డేవిడ్‌.. టీ20 స్పెషలిస్ట్‌

అయితే సింగపూర్‌ ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌ను ఆస్ట్రేలియా ఏకంగా వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి తీసుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. సింగపూర్‌లో జన్మించిన డేవిడ్‌.. పశ్చిమ ఆస్ట్రేలియాలో పెరిగాడు. టీ20 స్పెషలిస్ట్‌గా గతేడాది పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లోకి వచ్చిన అతడు.. ప్రపంచ క్రికెట్‌లో సంచలనంగా మారాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతన్ని ముంబై ఇండియన్స్‌ కూడా టీమ్‌లోకి తీసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లీగ్స్‌లో టిమ్‌ డేవిడ్‌ తనను తాను ప్రూవ్‌ చేసుకుంటున్నాడని, అందుకే వరల్డ్‌కప్‌ టీమ్‌లో అతనికి చోటు కల్పించినట్లు సెలక్టర్‌ జార్జ్‌ బెయిలీ చెప్పాడు. అతను ఉండటం వల్ల టీమ్‌ బ్యాటింగ్‌ మరింత లోతుగా ఉంటుందని, టీ20ల్లో టీమ్‌ సక్సెస్‌కు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో డేవిడ్‌ మాత్రమే సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ కాగా.. మిగతా వాళ్లంతా ముందుగా ఊహించిన వాళ్లే.

టీ20 వరల్డ్‌కప్‌ కంటే ముందు సెప్టెంబర్‌ 20న ఇండియాకు మూడు టీ20ల సిరీస్‌ కోసం రానున్న ఆస్ట్రేలియా.. తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఇండియాలతో సిరీస్‌లు ఆడనుంది. ప్లేయర్స్‌పై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో ఇండియా టూర్‌ నుంచి వార్నర్‌ను తప్పించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌

ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టాయినిస్‌, మాథ్యూ వేడ్‌, టిమ్‌ డేవిడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఆష్టన్‌ అగార్‌, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపా, జోష్ హేజిల్‌వుడ్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌