Tim David | ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లోకి సింగపూర్ ప్లేయర్!
డొమెస్టిక్ క్రికెట్‌లో ప్లేయర్స్ రాష్ట్రాలు మారినట్లే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ కొందరు తమ సొంత దేశానికి కాకుండా ఇతర దేశాలకు ఆడుతుంటారు. ఇప్పుడు మరో ప్లేయర్ అందుకు సిద్ధమయ్యాడు.
మెల్‌బోర్న్: భారత సంతతికి చెందిన ఎంతో మంది క్రికెటర్లను మనం ఎప్పటి నుంచో వెస్టిండీస్ టీమ్‌లో చూస్తున్నాం. ఇటు న్యూజిలాండ్‌లోనూ మన దేశంలో పుట్టి అక్కడి పెరిగి, అదే టీమ్‌కు ఆడిన, ఆడుతున్న ప్లేయర్స్ ఉన్నారు. ఒక దేశంలో పుట్టి ఆ దేశంతోపాటు మరో దేశానికి ఆడిన ప్లేయర్స్ కూడా క్రికెట్‌లో ఎంతోమంది ఉన్నారు. పేస్‌బౌలర్ డిర్క్ నానెస్ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా టీమ్స్‌కు ఆడగా.. మొదట ఐర్లాండ్‌కు ఆడిన ఇయాన్ మోర్గాన్ ఇప్పుడు ఏకంగా ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ అయ్యాడు.
ఇక ఇప్పుడు సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ కూడా ఆస్ట్రేలియా టీమ్‌కు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరో కాదు.. ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ ఆరోన్ ఫించే చెప్పడం గమనార్హం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించిన డేవిడ్‌ను టీ20 వరల్డ్‌కప్‌లోకి తీసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అతడు వరల్డ్‌కప్ ప్రాబబుల్స్‌లో ఉండనున్నట్లు ఫించ్ ఓ హింట్ ఇచ్చాడు.
నిజానికి టిమ్ డేవిడ్‌ది పశ్చిమ ఆస్ట్రేలియా. అయితే అతడు పుట్టింది మాత్రం సింగపూర్‌లో. ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆడిన డేవిడ్.. సింగపూర్ తరఫున 14 టీ20 గేమ్స్‌లో ఆడాడు. ఈ మధ్యే ఐపీఎల్‌లో ముంబై తరఫున సత్తా చాటాడు. అదే ఫామ్‌ను ఇంగ్లండ్‌లో జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో కొనసాగిస్తూ.. లాంకషైర్ తరపున 25 బాల్స్‌లోనే 60 రన్స్ బాదాడు.
అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని, రాబోయే రోజుల్లో అతన్ని జాగ్రత్తగా పరిశీలిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ చెప్పాడు. ప్రస్తుతానికి వచ్చే నెలలో శ్రీలంక వెళ్లే ఆస్ట్రేలియా టీ20 టీమ్‌లో అతనికి చోటు దక్కకపోయినా.. వరల్డ్‌కప్ దగ్గర పడుతుండటంతో డేవిడ్‌ను పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయడం చాలా అరుదైన నైపుణ్యం అని, అయితే డేవిడ్ మాత్రం చాలాసార్లు ఇది చేసి చూపించాడని ఫించ్ అన్నాడు.