Bumrah about criticism: మొరిగే ప్రతి కుక్కపై రాళ్లేస్తూ కూర్చోలేం.. విమర్శకులపై బుమ్రా ఫైర్
Bumrah about criticism: మొరిగే ప్రతి కుక్కపై రాళ్లేస్తూ కూర్చోలేం అంటూ తనను విమర్శిస్తున్న వారిపై చాలా ఘాటుగా స్పందించాడు పేస్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. అతని ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.
Bumrah about criticism: ఇండియన్ టీమ్ స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన విషయం తెలుసు కదా. ఇది ఆ మెగా టోర్నీలో ఇండియా అవకాశాలను ప్రభావితం చేస్తుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పెద్ద ఎత్తున విమర్శలూ వస్తున్నాయి. ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లూ ఆడతావ్.. ఇండియన్ టీమ్‌కు వచ్చేసరికి గాయాలు ఎందుకు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిలదీశారు.
ఇప్పటికీ ఆ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో తన విమర్శకులకు బుమ్రా గట్టి సమాధానమిచ్చాడు. నేరుగా కాకపోయినా తన ఇన్‌స్టా స్టోరీలో అతడు చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తనపై వస్తున్న విమర్శలకు బుమ్రా ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై ఇది అని భావిస్తున్నారు. బుధవారం (అక్టోబర్ 5) సాయంత్రం అతడు ఇన్‌స్టా స్టోరీలో ఈ పోస్ట్ చేశాడు.
"మొరుగుతున్న ప్రతి కుక్కపై రాళ్లు వేయడానికి ఆగుతుంటే ఎప్పటికీ మన గమ్యాన్ని చేరుకోలేము" అని బుమ్రా ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు. బుమ్రా ఇంత ఘాటుగా స్పందిస్తాడని ఎవరూ ఊహించలేదు. మరోవైపు బుమ్రా దూరం కావడంతో 14 మందితో కూడిన టీమ్ గురువారం తెల్లవారుఝామున ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటామన్నది ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత నిర్ణయిస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన విషయం తెలిసిందే.
ఆసియాకప్‌కు దూరమైన తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు తిరిగి వచ్చిన బుమ్రా రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు మరోసారి గాయపడ్డాడు. అతని వెన్నులో చీలక ఏర్పడిందని, సిరీస్ మొత్తం ఆడబోడని మొదట బీసీసీఐ ప్రకటించింది. అప్పుడే అతడు టీ20 వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యాడని వార్తలు రాగా.. కొన్ని రోజుల తర్వాత బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆ మరుసటి రోజే తాను వరల్డ్‌కప్‌లో ఆడకపోవడం చాలా బాధగా ఉందంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. "ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడకపోవడం చాలా బాధగా ఉంది. అయితే నా ప్రియమైన వారి నుంచి పొందుతున్న విషెస్, సపోర్ట్‌కు కృతజ్ఞుడిని. నేను కోలుకునే క్రమంలో ఆస్ట్రేలియాలో ఆడుతున్న ఇండియన్ టీమ్‌ను చీర్ చేస్తాను" అని బుమ్రా ట్వీట్ చేశాడు.