Hafeez on Babar Azam: బాబర్ ఆజం కెప్టెన్సీ పవిత్రమైన ఆవులాంటిది: మహ్మద్ హఫీజ్
24 October 2022, 16:08 IST
- Hafeez on Babar Azam: బాబర్ ఆజం కెప్టెన్సీ పవిత్రమైన ఆవులాంటిది.. దానిపై మనం ఏమీ మాట్లాడకూడదు అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియాతో మ్యాచ్‌లో ఓటమిపై స్పందిస్తూ.. బాబర్‌పై తీవ్రంగా మండిపడ్డాడు.
బాబర్ ఆజం కెప్టెన్సీపై మండిపడిన మహ్మద్ హఫీజ్
Hafeez on Babar Azam: బాబర్ ఆజం కెప్టెన్సీ పవిత్రమైన ఆవులాంటిది.. దానిపై ఎవరూ ఏమీ మాట్లాడకూడదు అనేలా పరిస్థితిని తీసుకొచ్చారంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియాతో మ్యాచ్ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోవడంపై అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాబర్ కెప్టెన్సీ నిర్ణయాలే ఈ ఓటమికి కారణమని అతడు స్పష్టం చేశాడు.
మరో మాజీ క్రికెటర్ అజర్ మహమూద్ కూడా బాబర్‌పై మండిపడ్డాడు. కీలకమైన సమయంలో మరో వికెట్ తీసి ఉంటే ఇండియా పనైపోయేదని, ఆ సమయంలో పేస్ బౌలర్లతో బౌలింగ్ చేయించకుండా స్పిన్నర్లతో వేయించడం, చివరి ఓవర్‌కు ఓ స్పిన్నర్ తప్ప ఎవరూ మిగలకపోవడంపై ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ తర్వాత పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో హఫీజ్ మాట్లాడాడు.
"బాబర్ ఆజం కెప్టెన్సీ ఓ పవిత్రమైన ఆవులాంటిది. దీనిని ఎవరూ విమర్శించకూడదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితి మారే వరకూ మనం ముందడుగు వేయలేం. బాబర్ కెప్టెన్సీలో లోపాలు కనిపించిన మూడో పెద్ద మ్యాచ్ ఇది. ఇన్నింగ్స్ 7 నుంచి 11వ ఓవర్ మధ్య ఇండియా ఓవర్‌కు 4 చొప్పున పరుగులు చేస్తున్నప్పుడే బాబర్ ఎందుకు స్పిన్నర్ల కోటాను పూర్తి చేయలేదు. ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల మన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను కోల్పోయాం" అని హఫీజ్ అన్నాడు.
ఇదే డిబేట్‌లో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ అజర్ మహమూద్ కూడా హఫీజ్ కెప్టెన్సీ నిర్ణయాలను ప్రశ్నించాడు. ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు స్పిన్నర్లతో కాకుండా ఫాస్ట్ బౌలర్లను తీసుకొచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా కండిషన్స్‌లో ఆడుతున్నప్పుడు నాలుగో పేసర్ ఆప్షన్ ఉండాలని, దానికి ఇఫ్తికార్ అహ్మద్ ఉన్నాడని కూడా అజర్ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో పాక్ పేస్ బౌలర్లు 19వ ఓవర్‌కే కోటా పూర్తవడంతో చివరి ఓవర్ స్పిన్నర్ నవాజ్ వేయాల్సి వచ్చింది. ఇది ముందుగానే ఊహించిన తాము.. అందుకు తగినట్లే ప్రణాళికతో ఆడినట్లు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లి చెప్పాడు. నవాజ్ చివరి ఓవర్లో ఓ నోబాల్, వైడ్ వేయడంతోపాటు 16 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు.