Google CEO Sundar Pichai on Ind vs Pak: పాకిస్థాన్ ఫ్యాన్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన గూగుల్ సీఈవో సుందర్
Google CEO Sundar Pichai on Ind vs Pak: పాకిస్థాన్ ఫ్యాన్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. ఈ మ్యాచ్‌పై తనను ట్రోల్ చేయడానికి చూసిన ఆ అభిమానిని పిచాయ్ తన రిప్లైతో తిరిగి ట్రోల్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
Google CEO Sundar Pichai on Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ప్రపంచమే దాసోహమంటుంది. క్రికెట్‌లోనే కాదు స్పోర్ట్స్‌లోని గొప్ప పోరాటాల్లో ఇండోపాక్ సమరం కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే గూగుల్‌లాంటి సంస్థ సీఈవో కూడా ఈ మ్యాచ్‌పై స్పందించారు. ఈ మ్యాచ్‌లో చివరి మూడు ఓవర్లను తాను మరోసారి చూసినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేయడం విశేషం.
సోమవారం తన అధికారిక ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన.. దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే ఈ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఈ ట్వీట్ చూసి సుందర్‌ను ట్రోల్ చేయడానికి ఓ పాకిస్థాన్ అభిమాని ప్రయత్నించాడు. దానికి కూడా సుందర్ దిమ్మదిరిగే రిప్లై ఇచ్చి అతని నోరు మూయించారు.
"హ్యాపీ దివాలీ! ఈ పండుగను జరుపుకుంటున్న వాళ్లంతా తమ కుటుంబాలు, స్నేహితులతో సరదాగా గడిపారని భావిస్తున్నాను. ఇవాళ ఆ చివరి మూడు ఓవర్లను మరోసారి చూసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఎంత గొప్ప మ్యాచ్, ఎంత గొప్ప ప్రదర్శన" అని సుందర్ ట్వీట్ చేశారు.
దీనికి ఓ పాకిస్థాన్ అభిమాని స్పందిస్తూ.. తొలి మూడు ఓవర్లు కూడా చూడాల్సింది అంటూ రిప్లై ఇచ్చాడు. ఇండియా ఇన్నింగ్స్‌తో తొలి మూడు ఓవర్లు ఇద్దరు ఓపెనర్లు ఔటై కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనికి సుందర్ మరోలా స్పందించారు. "అది కూడా చూశాను. భువీ, అర్ష్‌దీప్ స్పెల్ అద్భుతం" అంటూ పాకిస్థాన్ ఇన్నింగ్స్ తొలి మూడు ఓవర్లను అతనికి గుర్తు చేశాడు.
సుందర్ పిచాయ్ చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పాక్ అభిమానికి మంచి రిప్లై ఇచ్చారంటూ పిచాయ్‌ను మెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ కూడా తొలి మూడు ఓవర్లలోనే కష్టాల్లో పడిన విషయం తెలిసిందే. అర్ష్‌దీప్ సింగ్ తాను వేసిన తొలి బంతికే డేంజరస్ బ్యాటర్ బాబర్ ఆజం వికెట్ తీశాడు.