Raina on Ind vs Pak: టెన్షన్ వద్దు.. బాబర్ ఆజంను అతడు ఔట్ చేస్తాడు: రైనా
Raina on Ind vs Pak: టెన్షన్ వద్దు.. బాబర్ ఆజంను అతడు ఔట్ చేస్తాడంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. అటు బాబర్‌పై ప్రశంసలు కురిపిస్తూనే అతన్ని ఏ ఇండియన్ బౌలర్ ఔట్ చేయగలడో చెప్పాడు.
Raina on Ind vs Pak: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌పై చర్చలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా చేరాడు. ఈ మ్యాచ్ క్రికెట్ వర్గాల్లో ఎంతగానో ఆసక్తి రేపుతున్న విషయం తెలిసిందే. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్‌గా పిలుస్తున్న ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారోనని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌లో తొలిసారి ఇండియాపై పాకిస్థాన్ గెలిచింది. అది కూడా 10 వికెట్ల తేడాతో. ఆ విజయంలో కెప్టెన్ బాబర్ ఆజందే కీలకపాత్ర. ఈసారి కూడా టాప్ ఫామ్‌లో ఉన్న బాబర్‌ను ఔట్ చేస్తేనే ఇండియా మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. రిజ్వాన్‌తో కలిసి బాబర్ క్రీజులో నిలదొక్కుకుంటే మాత్రం కష్టమే. ఈ నేపథ్యంలో అతని వికెట్ ఎవరు తీస్తారన్న చర్చ జరుగుతోంది.
దీనిపై స్పందించిన సురేశ్ రైనా.. ఈసారి బాబర్ వికెట్ తీసేది అర్ష్‌దీప్ సింగే అని చెప్పడం విశేషం. అదే సమయంలో బాబర్‌పైనా అతడు ప్రశంసలు కురిపించాడు. "అతడో మంచి కెప్టెన్, గొప్ప క్రికెటర్. తన టీమ్ కోసం ఎంతో చేశాడు. కానీ మనపై అతడు బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం అర్ష్‌దీప్ సింగ్ అతన్ని ఔట్ చేస్తాడని అనుకుంటున్నా" అని రైనా అన్నాడు.
ఆ మధ్య ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ రెండుసార్లు తలపడ్డాయి. ఆ రెండు మ్యాచ్‌లలోనూ బాబర్‌కు అర్ష్‌దీప్ బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్‌లో ఆరు బాల్స్ ఎదుర్కొన్న బాబర్ ఆరు రన్స్ చేశాడు. అయితే ఆ టోర్నీ బాబర్ అంత మంచి ఫామ్‌లో లేడు. దీంతో ప్రతి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు చేయకుండానే వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బాబర్ తిరిగి గాడిలో పడ్డాడు. అతనితోపాటు రిజ్వాన్, బౌలింగ్‌లో షహీన్ అఫ్రిదిలపై పాకిస్థాన్ భారీ ఆశలే పెట్టుకుంది.