Ind vs Pak in T20 World Cup: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ డౌటే.. 80 శాతం వర్షం పడే ఛాన్స్
Ind vs Pak in T20 World Cup: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. ఈ మ్యాచ్ జరగబోయే మెల్‌బోర్న్‌లో ఆదివారం (అక్టోబర్ 23) 80 శాతం వర్షం పడే ఛాన్స్ ఉండటమే దీనికి కారణం.
Ind vs Pak in T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ సంగతేమోగానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నది మాత్రం కచ్చితంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసమే. కొన్ని నెలలుగా ఈ మ్యాచ్‌పై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆసియాకప్‌లో ఈ రెండు టీమ్స్ రెండుసార్లు తలపడినా.. ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు.
ఈ మ్యాచ్ కోసం 90 వేల టికెట్లు ఐదే ఐదు నిమిషాల్లో అమ్ముడైపోయాయంటే ఇండోపాక్ క్రికెట్ వార్‌కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. మరో నాలుగు వేల మంది నిలబడి మ్యాచ్ చూడటానికి కూడా సిద్ధమైపోయారు. ఇక కోట్లాది మంది ఆదివారం మధ్యాహ్నం టీవీ సెట్లకు అతుక్కుపోవడానికి ప్లాన్స్ వేస్తున్నారు. కానీ వాళ్లందరి ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించేలా ఉన్నాడు.
కొన్నాళ్లుగా ఆస్ట్రేలియాలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం కారణంగానే ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిదే. ఇక మెల్‌బోర్న్‌లోనూ వర్షాలు పడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగబోయే అక్టోబర్ 23న కూడా 80 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అది ఒక నుంచి 5 మిల్లీమీటర్ల వర్షం పడొచ్చని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఆదివారం సాయంత్రమే వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గంటకు 15 నుంచి 25 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నట్లు కూడా వాతావరణ శాఖ చెబుతోంది.
రిజర్వ్ డే కూడా లేదు
ఇదే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక మ్యాచ్ కనీసం ఐదేసి ఓవర్లపాటైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఆ రోజు అదైనా కుదురుతుందా లేదా అన్నది అనుమానమే. గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు. దీంతో వర్షం పడితే మ్యాచ్ మొత్తంగా రద్దవుతుంది. ఇండియా, పాకిస్థాన్ గతేడాది వరల్డ్‌కప్‌లో తలపడినప్పుడు పాక్ 10 వికెట్లతో గెలిచింది.
ఆ ఓటమికి చారిత్రక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని కోట్లాది మంది ఇండియన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడీ వరుణుడి ముప్పుతో అసలు మ్యాచ్ జరగడమే అనుమానంగా మారింది. దీంతో ఆ ఒక్క రోజూ వరుణుడు కరుణించాలని ఫ్యాన్స్ ఇప్పుడు ప్రార్థిస్తున్నారు.