Ind vs NZ Warm Up match called off: ఇండియా, న్యూజిలాండ్‌ వామప్‌ మ్యాచ్‌ రద్దు-ind vs nz warm up match called off due to rain in brisbane ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Nz Warm Up Match Called Off Due To Rain In Brisbane

Ind vs NZ Warm Up match called off: ఇండియా, న్యూజిలాండ్‌ వామప్‌ మ్యాచ్‌ రద్దు

Hari Prasad S HT Telugu
Oct 19, 2022 03:00 PM IST

Ind vs NZ Warm Up match called off: ఇండియా, న్యూజిలాండ్‌ వామప్‌ మ్యాచ్‌ రద్దయింది. బ్రిస్బేన్‌లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఒక్క బాల్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు.

రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ (ANI)

Ind vs NZ Warm Up match called off: టీ20 వరల్డ్‌కప్‌లోకి టీమిండియా ఒకే వామప్‌ మ్యాచ్‌తో వెళ్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచిన ఇండియన్ టీమ్‌.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా ఆడలేకపోయింది. బుధవారం (అక్టోబర్‌ 19) న్యూజిలాండ్‌తో వామప్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. బ్రిస్బేన్‌లో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది.

దీంతో టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో చివరి ఓవర్‌ మాత్రమే వేసి ఇండియాకు విజయం సాధించి పెట్టిన మహ్మద్‌ షమి ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో ఆడాలని భావించాడు. అయితే అతనికి మరింత బౌలింగ్‌ ప్రాక్టీస్‌ లేకుండా వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆదివారం(అక్టోబర్‌ 23) పాకిస్థాన్‌తో జరగబోయే తొలి మ్యాచ్‌కు ఇక ఇండియన్‌ టీమ్‌ సిద్ధమవ్వాల్సి ఉంది.

అయితే బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డు పడినట్లే ఇండోపాక్‌ మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు పొంచి ఉంది. మెల్‌బోర్న్‌లో ఈ మ్యాచ్‌ జరగబోయే రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌ కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. అలా జరగకూడదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ప్రార్థిస్తున్నారు.

ఈ వరల్డ్‌కప్‌ కోసం ఎంతో ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లిన ఇండియన్‌ టీమ్‌.. పెర్త్‌లో ప్రాక్టీస్‌ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వెస్టర్న్‌ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒకటి గెలిచి, మరో దాంట్లో ఓడిపోయింది. ఇక అక్కడి నుంచి బ్రిస్బేన్‌ వచ్చి రెండు వామప్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఆస్ట్రేలియాపై ఆడి గెలిచింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దయింది. ఇక ఇక్కడి నుంచి మెల్‌బోర్న్‌ వెళ్లనుంది. అక్కడే పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ జరగనుంది.

అటు పాకిస్థాన్‌ కూడా తొలి వామప్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతుల్లో ఓడింది. ఇక రెండో వామప్‌ మ్యాచ్‌ ఆఫ్ఘనిస్థాన్‌తో జరగాల్సి ఉండగా.. అది కాస్తా వర్షం కారణంగా మొత్తం మ్యాచ్‌ జరగలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్‌ చేసింది. షహీన్‌ అఫ్రిది 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత చేజింగ్‌ మొదలుపెట్టిన పాకిస్థాన్‌ 2.2 ఓవర్లలో 19 రన్స్‌ చేసిన సమయంలో వర్షం కురిసింది.

WhatsApp channel