Kapil Dev on Team India: టీమిండియా వరల్డ్‌కప్ సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే: కపిల్ దేవ్
Kapil Dev on Team India: టీమిండియా వరల్డ్‌కప్ సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే అంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడు అలా అనడానికి కారణమేంటి?
Kapil Dev on Team India: ఈసారి టీ20 వరల్డ్‌కప్‌పై టీమిండియాతోపాటు అభిమానులు కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే 1983 వరల్డ్‌కప్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం పెదవి విరిచాడు. అసలు ఇండియన్ టీమ్ సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే అని అతడు అనడం గమనార్హం.
"టీ20 క్రికెట్‌లో ఒక మ్యాచ్ గెలిచే టీమ్ తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవచ్చు. ఇండియా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాల గురించి మాట్లాడటం చాలా కష్టం. ఇక్కడ అసలు వాళ్లు ఫైనల్ ఫోర్‌కి చేరతారా అన్నదే. నేను దీని గురించే ఆలోచిస్తున్నాను. ఆ తర్వాతే ఏదైనా చెప్పగలం. నా వరకు ఇండియా టాప్ ఫోర్‌లోకి చేరడానికి కేవలం 30 శాతం అవకాశమే ఉంది" అని ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కపిల్ చెప్పాడు.
అయితే దీని వెనుక కారణమేంటన్నది మాత్రం కపిల్ వివరించలేదు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమ్‌కు ఎంతగానో ఉపయోగపడతాడని మాత్రం చెప్పాడు. "వరల్డ్‌కప్ అనే కాదు ఏ మ్యాచ్‌లు లేదా ఈవెంట్లు గెలిపించే ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? హార్దిక్ పాండ్యాలాంటి ప్లేయర్ ఇండియాకు ఎంతో ఉపయోగపడతాడు. ఏ టీమ్‌కైనా ఆల్‌రౌండర్లు కీలకం. వాళ్లే టీమ్‌కు బలం. తుది జట్టులో ఆరో బౌలర్‌ను తీసుకునే స్వేచ్ఛను హార్దిక్‌లాంటి ప్లేయర్స్ రోహిత్‌కు ఇస్తారు. అతడు మంచి బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ కూడా. రవీంద్ర జడేజా కూడా ఇండియాకు మంచి ఆల్‌రౌండరే" అని కపిల్ అన్నాడు.
తాము ఆడే రోజుల్లోనూ టీమ్‌లో ఎంతోమంది ఆల్‌రౌండర్లు ఉండేవాళ్లని చెప్పాడు. ఇక ఇండియన్ టీమ్‌కు హార్దిక్ మరో కపిల్ దేవ్ అనే కామెంట్స్‌పై కూడా కపిల్ స్పందించాడు. "మా రోజుల్లో కూడా ఆరాధ్య క్రికెటర్లు ఉండేవాళ్లు. మేము వాళ్లను ఫాలో అయ్యేవాళ్లం. యువ క్రికెటర్లు కొత్త ప్రమాణాలను నెలకొల్పడం మంచిదే. అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కఠినంగా శ్రమించాలి" అని కపిల్ అన్నాడు.
ఇక ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలంగా ఉందని చెప్పాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ టీమ్‌కు బలమని అన్నాడు. "నిజానికి సూర్యకుమార్ ఇంతగా ప్రభావం చూపుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ అతడు బ్యాటింగ్‌లో ఎంతో గొప్పగా రాణించి ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇప్పుడు అతడు లేని ఇండియన్ టీమ్‌ను ఊహించలేం. విరాట్, రోహిత్, రాహుల్‌లాంటి వాళ్లతో కలిసి సూర్య ఉండటం ఏ టీమ్‌నైనా బలంగా మారుస్తుంది" అని కపిల్ చెప్పాడు.