Raina on Shami: షమి కాదు కదా.. బుమ్రా స్థానాన్ని ఎవరితోనూ భర్తీ చేయలేం: రైనా
Raina on Shami: షమి కాదు కదా.. బుమ్రా స్థానాన్ని ఎవరితోనూ భర్తీ చేయలేమని అన్నాడు టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా. అయితే అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్‌ను ఎంపిక చేశారని చెప్పాడు.
Raina on Shami: టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా లేని లోటును మహ్మద్ షమి భర్తీ చేయబోతున్నాడన్ని అతడు వేసిన ఒక్క ఓవర్ చూసే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా అభిమానులంతా బలంగా నమ్ముతున్నారు. ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన షమి.. ఏకంగా 4 వికెట్లు (ఒక రనౌట్) తీసి ఇండియన్ టీమ్‌ను గెలిపించాడు.
ఏడాది తర్వాత ఇండియన్ టీ20 టీమ్‌లోకి తిరిగొచ్చిన షమి.. తానేంటో ఆ ఒక్క ఓవర్‌తోనే నిరూపించుకున్నాడు. ఆ ఓవర్ చూసిన అభిమానుల ఆందోళన చాలా వరకూ తగ్గింది. బుమ్రా స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేయగల సత్తా ఉన్న బౌలర్ షమినే అని భావిస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా వాదన మాత్రం మరోలా ఉంది. అసలు బుమ్రాకు పరిపూర్ణమైన ప్రత్యామ్నాయం అంటూ ఎవరూ లేరని అతడు అనడం గమనార్హం.
"షమిని నేను పరిపూర్ణ ప్రత్యామ్నాయం అని నేను అనను. ఎందుకంటే బుమ్రా లేదా రవీంద్ర జడేజాలను ఎవరూ భర్తీ చేయలేరు. వాళ్లు ఇండియాకు నిలకడగా ఆడారు. అద్భుతంగా రాణించారు" అని ఎన్డీటీవీతో రైనా అన్నాడు. అయితే అందుబాటులో ఉన్న ఆప్షన్లు చూస్తే మాత్రం షమినే బెస్ట్ అని కూడా అన్నాడు.
"అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆప్షన్‌నే ఎంపిక చేశారు. షమి చాలా మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక 15 రోజుల ముందే టీమ్‌ను ఆస్ట్రేలియాకు పంపించి బీసీసీఐ మంచి పని చేసింది. అక్కడి గ్రౌండ్లు చాలా పెద్దవి. మొత్తంగా టీమ్ సంసిద్ధత బాగుంది. భయం లేని క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది" అని రైనా అన్నాడు.
గాయం కారణంగా బుమ్రా టీ20 వరల్డ్‌కప్‌కు దూరం కావడంతో అతని స్థానంలో ఎవరు అన్న చర్చ కొద్ది రోజులుగా సాగింది. మొత్తానికి ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత షమిని తీసుకుంటున్నట్లు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. టీమ్ తనపై పెట్టుకున్న ఆశలను తొలి వామప్ మ్యాచ్‌లో షమి వమ్ము చేయలేదు. చివరి ఓవర్లో 11 రన్స్ అవసరం కాగా.. బంతి అందుకున్న షమి.. కేవలం 4 రన్స్ ఇచ్చి చివరి 4 బాల్స్‌లో నాలుగు వికెట్లు (ఒక రనౌట్) తీయడం విశేషం.