Rohit Sharma on Shami: షమికి చివరి ఓవర్‌ ఇచ్చింది అందుకే..: రోహిత్‌ శర్మ-rohit sharma on shami says they wanted to challenge him with one over ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma On Shami: షమికి చివరి ఓవర్‌ ఇచ్చింది అందుకే..: రోహిత్‌ శర్మ

Rohit Sharma on Shami: షమికి చివరి ఓవర్‌ ఇచ్చింది అందుకే..: రోహిత్‌ శర్మ

Hari Prasad S HT Telugu
Oct 17, 2022 05:13 PM IST

Rohit Sharma on Shami: మహ్మద్‌ షమికి చివరి ఓవర్‌ ఇవ్వడంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనికి కేవలం ఆ ఒక్క ఓవరే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాడు.

రోహిత్ శర్మ, మహ్మద్ షమి
రోహిత్ శర్మ, మహ్మద్ షమి (AP)

Rohit Sharma on Shami: టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లో బుమ్రా స్థానంలో సెలక్టర్లు తనకు ఎందుకు ఛాన్సిచ్చారో మహ్మద్‌ షమి ఒకే ఓవర్‌తో చెప్పేశాడు. ఏడాది కాలంగా ఇండియన్‌ టీ20 టీమ్‌కు దూరంగా ఉన్నా తన రాకను ఘనంగా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంచలన ఓవర్‌తో ఇండియన్‌ టీమ్‌ను గెలిపించాడు.

చివరి ఓవర్లో 11 రన్స్‌ అవసరం కాగా.. అతడు కేవలం 4 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. మరో రనౌట్‌ కూడా చేయడంతో ఆస్ట్రేలియా 6 రన్స్‌ తేడాతో ఓడిపోయింది. అయితే అసలు తుది జట్టులోనే లేని షమిని అనూహ్యంగా 20వ ఓవర్‌ కోసం తీసుకురావడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యాచ్‌ తర్వాత స్పందించాడు. అతనికి ఓ ఛాలెంజ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలా చివరి ఓవర్‌ను వేయించినట్లు చెప్పాడు.

"మహ్మద్‌ షమి అద్భుతం. బంతితో అతడు ఎంత ప్రమాదకారో మనకు తెలుసు. అదే చేసి చూపించాడు. అతడు చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. అందుకే అతనికి ఒక ఓవర్‌ ఇవ్వాలనుకున్నాం. సవాలు చేయాలనుకున్నాం. అతడు ఏం చేశాడో మనం చూశాం" అని రోహిత్‌ అన్నాడు.

గాయం కారణంగా బుమ్రా దూరం కావడంతో రిజర్వ్‌ ప్లేయర్స్‌లో ఉన్న షమిని 15 మంది టీమ్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా కండిషన్స్‌లో బౌలింగ్‌ చేసిన అనుభవం ఉన్న షమికే అవకాశం వస్తుందని క్రికెట్‌ పండితులు అంచనా వేసినట్లే టీమ్‌ అతనికి అవకాశం ఇచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని షమి ఒక్క ఓవర్‌తోనే సద్వినియోగం చేసుకున్నాడు.

"టీమ్‌ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. బౌలర్లు ఇంకా నిలకడగా రాణించాలని కోరుకుంటున్నా. ఈ మ్యాచ్‌ మాకు బాగుంది. వాళ్ల టీమ్‌ ఓ మంచి పార్ట్‌నర్‌షిప్‌తో మాపై ఒత్తిడి తెచ్చింది" అని రోహిత్‌ చెప్పాడు. తొలి వామప్ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. అక్టోబర్‌ 19న న్యూజిలాండ్‌తో రెండో వామప్‌ మ్యాచ్ ఆడనుంది.

WhatsApp channel