Graham Reid resigned: వరల్డ్ కప్‌లో ఓటమి.. ఇండియన్ టీమ్ కోచ్ రాజీనామా
30 January 2023, 16:31 IST
- Graham Reid resigned: వరల్డ్ కప్‌లో ఓటమితో ఇండియన్ హాకీ టీమ్ కోచ్ గ్రాహమ్ రీడ్ రాజీనామా చేశాడు. అతనితోపాటు అనలిటికల్ కోచ్, సైంటిఫిక్ అడ్వైజర్లు కూడా పదవుల నుంచి తప్పుకున్నారు.
గ్రాహమ్ రీడ్
Graham Reid resigned: స్వదేశంలో జరిగిన హాకీ వరల్డ్ కప్ లోనూ ఇండియన్ టీమ్ దారుణంగా విఫలమైన విషయం తెలుసు కదా. ఈ మెగా టోర్నీలో ఏకంగా 9వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఇండియన్ హాకీ టీమ్ కోచ్ గా ఉన్న గ్రాహమ్ రీడ్.. ఈ టోర్నీ ముగిసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేశాడు. అతనితోపాటు అనలిటికల్ కోచ్ గా ఉన్న గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ కూడా పదవుల నుంచి తప్పుకున్నారు.
ఈ వరల్డ్ కప్ లో జర్మనీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆదివారం (జనవరి 29) జరిగిన ఫైనల్లో బెల్జియంపై పెనాల్టీ షూటౌట్లో జర్మనీ విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత ఇండియా పూల్ డీలో ఇంగ్లండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆ క్వార్టర్ ఫైనల్ చేరడానికి క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆడింది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.
ఒక దశలో 3-1తో ఆధిక్యంలో ఉన్నా చివరికి న్యూజిలాండ్ కు స్కోరు సమం చేసే అవకాశం ఇవ్వడం, పెనాల్టీ షూటౌట్లో చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. అయితే వరల్డ్ కప్ లో విఫలమైనా కోచ్ గ్రాహమ్ రీడ్ ఆధ్వర్యంలో ఇండియన్ టీమ్ 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ లో ఇండియన్ టీమ్ గెలిచిన తొలి మెడల్ ఇదే కావడం విశేషం.
ఇక 2022 కామన్వెల్త్ గేమ్స్ లోనూ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. 2021-22 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ సీజన్ లో ఇండియన్ టీమ్ మూడోస్థానంలో ఉంది. 2019లో గ్రాహమ్ రీడ్ ఇండియన్ టీమ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. టీమ్, హాకీ ఇండియాతో కలిసి ఇన్నేళ్లు పని చేయడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తన రాజీనామా సందర్భంగా రీడ్ అన్నాడు.
ఇక ఇండియన్ టీమ్ కు గ్రాహమ్ రీడ్, అతని సపోర్ట్ స్టాఫ్ అందించిన సేవలకుగాను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్ గేమ్స్ తో పాటు వివిధ టోర్నీల్లో దేశానికి మంచి ఫలితాలను అందించాడని కొనియాడారు.