Virat Kohli: విరాట్ కోహ్లీ.. ముందు డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడు.. తర్వాత చూద్దాం
12 July 2022, 16:00 IST
- Virat Kohli: ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం విరాట్ కోహ్లి ఫామ్‌పై నడుస్తున్నంత చర్చ మరేదానిపై జరగడం లేదు. అతని ఫామ్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
విరాట్ కోహ్లి
లండన్: విరాట్ కోహ్లి ఎలాంటి సందేహం లేకుండా ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడు. ఎంతోమంది గొప్ప ప్లేయర్స్‌లాగే ప్రస్తుతం అతడు కూడా ఫామ్ కోల్పోయాడు. ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. అయితే గతంలో ఎప్పుడూ ఏ ప్లేయర్‌పై లేనంత చర్చ మాత్రం ఇప్పుడు అతనిపై నడుస్తోంది. టీమ్‌లో నుంచి తీసేయాలని ఒకరు, మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మరొకరు.. ఇలా క్రికెట్ ప్రపంచమే రెండుగా చీలిపోయింది.
కపిల్‌దేవ్, వెంకటేశ్ ప్రసాద్‌లాంటి మాజీలు కోహ్లిని పక్కనపెట్టాలని నిర్మొహమాటంగా చెబుతుండగా.. కెప్టెన్ రోహిత్‌శర్మతోపాటు మరికొందరు మాజీలు మాత్రం విరాట్‌ను వెనకేసుకొస్తున్నారు. ఇక ఇంకొందరు కోహ్లికి విలువైన సూచనలు కూడా చేస్తున్నారు. తాజాగా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ కూడా కోహ్లికి డొమెస్టిక్ క్రికెట్‌కు వెళ్లి మళ్లీ ఫామ్‌లోకి రావాల్సిందిగా సూచిస్తున్నాడు.
"ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో చాలా పోటీ ఉంది. కొన్ని ఇన్నింగ్స్‌పాటు ఆడకపోతే ఎంతటి ఎక్స్‌పీరియెన్స్ ప్లేయర్ అయినా సరే సెలక్షన్ కమిటీ కఠినంగా వ్యవహరిస్తుంది. చాలు ఇక.. డొమెస్టిక్ క్రికెట్‌కు తిరిగి వెళ్లి, ఫామ్‌లోకి తిరిగి రా.. అప్పుడు చూద్దాం అని అంటారు. విరాట్ కోహ్లికి కూడా అదే ఎందుకు జరగకూడదు" అని కిర్మాణీ అన్నాడు.
మరోవైపు మరో మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా కోహ్లికి మద్దతుగా నిలిచి, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అంటున్నాడు. "ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేకపోవచ్చు కానీ గతంలో అతని ఆట, గెలిపించిన మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకొని అతనికి మద్దతివ్వాలి. ఓ ప్లేయర్‌గా అతడో మ్యాచ్ విన్నర్. ఎప్పుడూ కఠిన పరిస్థితుల్లో ఆడినవాడు. జూనియర్లకు ఇచ్చినట్లే కొన్నిసార్లు సీనియర్లకూ అండగా నిలవాలి. అందుకే అతనిపై నమ్మకం ఉంచి అతడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూడాలి" అని మిశ్రా అన్నాడు.