Virat Kohli: గంగూలీ, సెహ్వాగ్‌లాంటి వాళ్లనూ పక్కనపెట్టారు: కోహ్లిపై వెంకటేశ్‌ప్రసాద్
11 July 2022, 12:54 IST
- Virat Kohli: విరాట్ కోహ్లి ఫామ్, టీమ్‌లో అతనికి చోటు కల్పించడంపై క్రికెట్ ప్రపంచం రెండుగా విడిపోయింది. తాజాగా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా కపిల్ దేవ్ అభిప్రాయంతో ఏకీభవించాడు.
విరాట్ కోహ్లి
ట్రెంట్‌బ్రిడ్జ్: ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని క్రికెట్‌లో తరచూ అంటుంటారు. ఓ గొప్ప ప్లేయర్ కొన్నాళ్ల పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సమయంలో ఈ మాటే చెబుతుంటారు. ఇప్పుడు విరాట్ కోహ్లి విషయంలో ఈ చర్చ జరుగుతోంది. ఫామ్‌లో లేని ప్లేయర్‌ను టీమ్‌లోకి ఎందుకు తీసుకోవడం అని కపిల్ దేవ్‌లాంటి ప్లేయర్స్ అంటుంటే.. గత రికార్డులు పట్టించుకోకపోతే ఎలా అని కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు పలువురు ఇతర క్రికెటర్లు వాదిస్తున్నారు.
తాజాగా టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా కోహ్లి ఫామ్‌పై స్పందించాడు. ఫామ్‌లో లేని కోహ్లిని టీమ్‌లోకి ఎందుకు ఎంపిక చేయడం అని ప్రశ్నించిన కపిల్ దేవ్ అభిప్రాయంతో అతడు ఏకీభవించాడు. ఒకప్పుడు గంగూలీ, జహీర్‌ఖాన్, సెహ్వాగ్, హర్భజన్‌లాంటి ప్లేయర్స్‌ను కూడా ఫామ్‌లో లేనప్పుడు పక్కన పెట్టిన విషయాన్ని ప్రసాద్ తన ట్వీట్‌లో గుర్తు చేశాడు.
"ఒకప్పుడు ఫామ్‌లో లేకపోతే పేరుప్రతిష్టలతో సంబంధం లేకుండా పక్కన పెట్టేవారు. సౌరవ్, సెహ్వాగ్, యువరాజ్, జహీర్, భజ్జీలాంటి వాళ్లను ఫామ్‌లో లేనప్పుడు పక్కన పెట్టారు. వాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌కు వెళ్లి మళ్లీ రన్స్ చేసి తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఫామ్‌లో లేని వాళ్లకు రెస్ట్ ఇస్తున్నారు. దీనివల్ల వాళ్లు ఫామ్‌లోకి రారు. దేశంలో చాలా టాలెంట్ ఉంది. గొప్ప పేరు ఉన్నంత మాత్రాన ఆడలేరు. గొప్ప మ్యాచ్ విన్నర్ అనిల్ కుంబ్లే కూడా ఎన్నోసార్లు టీమ్ నుంచి బయటకు వెళ్లాడు. గొప్ప మేలు జరిగే దిశగా మన చర్యలు ఉండాలి" అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.
చాలా రోజులుగా పరుగులు చేయడానికి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లికి టీ20 టీమ్‌లో చోటు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ కోహ్లి కోసం ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాను పక్కన పెట్టారు. కానీ కోహ్లి తాను ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఫెయిలయ్యాడు.