virat kohli: కోహ్లిని బెంచ్ కు పరిమితం చేయాలంటూ కపిల్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కోచ్ ఫైర్...
10 July 2022, 13:30 IST
- కోహ్లి విషయంలో బీసీసీఐ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని తాను అనుకుంటున్నట్లుగా కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. కోహ్లిని టీ20 టీమ్ నుండి తప్పించాలని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్ కుమార్ శర్మ ఫైర్ అయ్యారు.
విరాట్ కోహ్లి
టీ20 క్రికెట్ లో కోహ్లిని పక్కనపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇటీవలే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అశ్విన్ లాంటి గొప్ప బౌలర్ నే బెంచ్ కు పరిమితం చేసినప్పుడు కోహ్లిని జట్టు నుండి తొలగించడంలో తప్పులేదని కపిల్ వ్యాఖ్యానించాడు. అతడి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే మంచిదంటూ పేర్కొన్నాడు.
కోహ్లి ఫామ్ దృష్ట్యా కపిల్ వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ తో పాటు శనివారం జరిగిన రెండో టీ20 లో కోహ్లి విఫలమవ్వడంతో మరోసారి అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కపిల్ దేవ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. టీమ్ ఇండియా తరఫున విరాట్ ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడని,దేశానికి గొప్ప విజయాల్ని అందించాడని రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నాడు.
ఓ ఆటగాడు 70 అంతర్జాతీయ సెంచరీలు చేయడం సులభం కాదని, ఆ ఘనతల వెనుక ఎంతో ప్రతిభ, హార్డ్ వర్క్ ఉన్నాయని తెలిపాడు. అలాంటి ఆటగాడిని బెంచ్ పై కూర్చొబెడుతుందని తాను అనుకోవడం లేదని చెప్పాడు. కోహ్లి ఫామ్ విషయంలో బోర్డ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. రాజ్ కుమార్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మూడో టీ20లో కోహ్లిని తప్పించి దీపక్ హుడాను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాపిక్