Gavaskar on Team India: వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి కాలరెగరేస్తే లాభం లేదు: గవాస్కర్ చురక
13 June 2023, 21:35 IST
- Gavaskar on Team India: వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి కాలరెగరేస్తే లాభం లేదంటూ టీమిండియాకు గవాస్కర్ చురకంటించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోవడంపై సన్నీ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాపై ఘాటు విమర్శలు చేసిన సునీల్ గవాస్కర్
Gavaskar on Team India: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బలహీనంగా ఉన్న వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించినా లాభం లేదని అతడు అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిని పూర్తిస్థాయిలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. గవాస్కర్ కాస్త పరుషమైన కామెంట్స్ చేశాడు. "42 పరుగులకే ఆలౌటైన టీమ్స్ లోనూ నేనున్నాను. డ్రెస్సింగ్ రూమ్ లో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. చాలా మంది ఘాటుగా విమర్శించారు. అందువల్ల ఇప్పుడున్న టీమ్ పై విమర్శలు చేయకూడదని చెప్పకూడదు. ఏం జరిగిందో వాళ్లు విశ్లేషించుకోవాలి. ఎలా ఔటయ్యారు? ఎందుకు సరిగా బౌలింగ్ చేయలేదు? ఎందుకు క్యాచ్ లు పట్టలేదు? తుది జట్టు ఎంపిక నిర్ణయం సరైనదేనా? ఇలా అన్నింటినీ విశ్లేషించుకోవాల్సి అవసరం ఉంది" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
ఇక ఇప్పుడు వెస్టిండీస్ వెళ్లి, బలహీనమైన ఆ జట్టును చిత్తుగా ఓడిస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదని సన్నీ అనడం గమనార్హం. నెల రోజుల విరామం తర్వాత టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. దీనిపైనే గవాస్కర్ స్పందించాడు.
"వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ లున్నాయి కదా చూసుకుందాం అంటూ ఈ ఓటమిని మరచిపోకూడదు. వెస్టిండీస్ అంత గట్టి జట్టేమీ కాదు. అక్కడికి వెళ్లి వాళ్లను 2-0, 3-0తో ఓడించడంలో అసలు అర్థం లేదు. ఎందుకంటే ఫైనల్స్ కు వెళ్లి అక్కడ ఆస్ట్రేలియాతో ఆడుతూ చేసిన తప్పిదాలనే మళ్లీ చేస్తే ట్రోఫీ ఎలా గెలుస్తారు?" అని గవాస్కర్ ప్రశ్నించాడు.