Gavaskar on Ashwin: అశ్విన్‌ను దారుణంగా అవమానించారు.. నంబర్ వన్ బ్యాటర్‌ను పక్కన పెట్టగలరా?: గవాస్కర్
13 June 2023, 13:46 IST
- Gavaskar on Ashwin: అశ్విన్‌ను దారుణంగా అవమానించారు.. నంబర్ వన్ బ్యాటర్‌ను పక్కన పెట్టగలరా అంటూ టీమిండియాపై గవాస్కర్ మండిపడ్డాడు. ఆధునిక క్రికెట్ లో ఈ ఇతర టాప్ క్రికెటర్ ను ఇలా ట్రీట్ చేయలేదని సన్నీ అన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్
Gavaskar on Ashwin: టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ట్రీట్ చేసినట్లుగా మరే ఇతర టాప్ క్రికెటర్ ను ట్రీట్ చేయలేదని అతడు స్పష్టం చేశాడు. మిడ్ డేకు రాసిన కాలమ్‌లో మేనేజ్‌మెంట్ తీరుపై సన్నీ విరుచుకుపడ్డాడు.
అదే అతని స్థానంలో ఓ నంబర్ వన్ బ్యాటర్ ఉంటే ఇలాగే చేసేవారా అని ప్రశ్నించాడు. "ఆధునిక క్రికెట్ లో ఈ ఇతర టాప్ క్లాస్ ఇండియన్ క్రికెటర్ కు అశ్విన్ లాగా జరగలేదు. ఒకవేళ నంబర్ వన్ బ్యాటర్ ఉంటే అతడు గతంలో పచ్చిక ఉన్న పిచ్ పై లేదంటే స్పిన్ పిచ్ పై సరిగా ఆడలేదంటూ పక్కన పెట్టేవారా? ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇలా చేయకపోయి ఉంటే ఇప్పటికే అశ్విన్ 100కు పైగా టెస్టులు ఆడేవాడు" అని గవాస్కర్ అనడం గమనార్హం.
ఇండియా ఈ మ్యాచ్ లో గెలిచి ఉన్న కూడా అశ్విన్ ను ట్రీట్ చేసిన విధానం మాత్రం సరికాదని సన్నీ అన్నాడు. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 444 పరుగులు చేజ్ చేయాల్సి రావడం చూస్తే అశ్విన్ ను పక్కన పెట్టాలన్న నిర్ణయం ఘోర తప్పిదమని అర్థమవుతూనే ఉన్నదని గవాస్కర్ స్పష్టం చేశాడు. అశ్విన్ ఇప్పటి వరకూ కెరీర్లో 92 టెస్టులు ఆడి 474 వికెట్లు తీసుకున్నాడు.
ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ అతడే. అలాంటి బౌలర్ ను డబ్ల్యూటీసీ ఫైనల్లో పిచ్ పై పచ్చిక ఉందంటూ నాలుగో పేస్ బౌలర్ కోసం పక్కన పెట్టారు. కానీ ఆ ఎత్తుగడ ఫలించలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడంతోనే టీమిండియా మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. పైగా ఆస్ట్రేలియా జట్టులో నలుగురు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉండటంతో అశ్విన్ మాత్రమే వాళ్లను కట్టడి చేసి ఉండేవాడని గవాస్కర్ గతంలోనూ అభిప్రాయపడ్డాడు.