Ganguly on Indore Pitch: రెండు రోజుల్లో 30 వికెట్లు.. ఇండోర్ పిచ్‌పై గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
03 March 2023, 9:34 IST
- Ganguly on Indore Pitch: రెండు రోజుల్లో 30 వికెట్లు నేలకూలిన ఇండోర్ పిచ్‌పై గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ పిచ్ పై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సౌరవ్ గంగూలీ
Ganguly on Indore Pitch: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలుపోటముల కంటే పిచ్ లపై చర్చే ఎక్కువ నడుస్తోంది. తొలి టెస్ట్ నుంచే స్పిన్ పిచ్ లపై ఎంతో మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక మూడో టెస్ట్ జరుగుతున్న ఇండోర్ లో తొలి రోజు తొలి సెషన్ నుంచే బంతి టర్న్ అవడంపై పలువురు మాజీలు మండిపడ్డారు. ఇదో చెత్త పిచ్ అని నిందించారు.
తొలి రోజే ఇండియా లంచ్ తర్వాత 109 పరుగులకే చాప చుట్టేయడం.. మొత్తంగా ఆ రోజు 14 వికెట్లు, రెండో రోజు 16 వికెట్లు పడటంతో ఈ పిచ్ టెస్ట్ క్రికెట్ కు అసలు ఏమాత్రం పనికిరాదన్న వాదన మొదలైంది. రెండు రోజుల్లో మూడు ఇన్నింగ్స్ ముగిసిపోయాయి. మూడో రోజు 76 పరుగులు కొడితే చాలు ఆస్ట్రేలియా గెలుస్తుంది.
ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మిగతా మాజీలలాగా అతడు ఈ పిచ్ పై మరీ తీవ్రస్థాయిలో విమర్శలు చేయలేదు. సింపుల్ గా ఒకే లైన్ లో సమాధానం ఇచ్చాడు. "టెస్ట్ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి" అని దాదా అనడం విశేషం. అతని వ్యాఖ్యలు వెనుక ఉద్దేశమేంటో అంతుబట్టడం లేదు.
పిచ్ ల విషయంలో పలు చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ మాజీ బాస్ కూడా అయిన గంగూలీ.. ఇలాంటి కామెంట్స్ చేయడంతో వాటికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మరీ ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లలో పిచ్ లను ఐసీసీ క్యూరేటర్ల ఆధ్వర్యంలో తయారు చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి.
తొలి రోజు ఇండియా దారుణమైన స్కోరుకు ఆలౌటైనా కూడా ఈ టెస్టులో ఆతిథ్య జట్టు మళ్లీ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు గంగూలీ. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి మాత్రం ఆ ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. కేవలం 76 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.