Ganguly on Dhoni: ధోనీ ఓ ఛాంపియన్.. ఓ జనరేషన్‌నే మార్చేశాడు: గంగూలీ
06 February 2023, 19:47 IST
- Ganguly on Dhoni: ధోనీ ఓ ఛాంపియన్.. ఓ జనరేషన్‌నే మార్చేశాడు అంటూ మిస్టర్ కూల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దేశంలోని మారుమూల ప్రాంతంలోని వాళ్లు కూడా ఇండియన్ టీమ్ కు ఆడేలా కలలు కనేలా చేశాడని కొనియాడాడు.
సౌరవ్ గంగూలీ
Ganguly on Dhoni: ఇండియన్ క్రికెట్ ను సమూలంగా మార్చేసిన కెప్టెన్లలో ఒకరు సౌరవ్ గంగూలీ కాగా.. మరొకరు ఎమ్మెస్ ధోనీ. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయిన టీమ్ ను మళ్లీ గాడిలో పెట్టి విదేశాల్లోనూ చిరస్మరణీయ విజయాలు సాధించేలా చేసిన వ్యక్తి గంగూలీ. ఇక ఆ ఇండియన్ క్రికెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లి.. ప్రతి ఐసీసీ ట్రోఫీని గెలిచిన కెప్టెన్ ధోనీ.
అలాంటి ధోనీపై గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడో ఛాంపియన్ అని అన్నాడు. సోమవారం కోల్‌కతాలో జరిగిన స్పోర్ట్స్ స్టార్ ఈస్ట్ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ లో మాట్లాడిన అతడు.. ధోనీ గురించి మాట్లాడాడు. "ఎమ్మెస్ ధోనీ గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు ఆడిన మ్యాచ్ ల గురించి మాత్రమే మాట్లాడలేము. ఇండియన్ క్రికెట్ పై అతడు చూపిన ప్రభావం అలాంటిది.
అతన్ని రెండు రోజుల కిందట ముంబైలో కలిశాను. ఇద్దరం ఓ షూటింగ్ లో ఉన్నాం. అతడో ఛాంపియన్. ఇండియన్ క్రికెట్ లోని ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో ఒకడు. వరల్డ్ కప్స్ గెలిచాడు. అది కూడా అసలు ఎలాంటి ప్లేయర్స్ ను ఇవ్వని రాంచీ నుంచి వచ్చి సాధించాడు" అని గంగూలీ అన్నాడు.
దేశంలోని తూర్పు భాగంలో క్రికెట్ పెద్దగా పాపులర్ కాదు అన్న అపోహను ధోనీ తుడిచిపెట్టేశాడని కూడా గంగూలీ చెప్పాడు. "నేను గర్వంగా ఫీలవుతాను. దేశంలో క్రికెట్ ప్రాచుర్యం పెద్దగా లేదని భావించే ప్రాంతం నుంచి ఇద్దరు మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లు వచ్చారు. ఎమ్మెస్ ధోనీ చేసింది అదే. ఓ జనరేషన్ నే మార్చేశాడు. నేను కూడా సక్సెస్ సాధించగలను అన్న నమ్మకం కలిగించాడు. ఇషాన్ కిషన్ నే చూడండి. అతడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఎలా ఆడుతున్నాడో" అని దాదా చెప్పాడు.
ధోనీ కంటే కెప్టెన్ అంటే ఇండియన్ క్రికెట్ లో ఎక్కువగా గంగూలీ పేరే వినిపించేది. కానీ ధోనీ వచ్చిన తర్వాత ఇండియా వరుసగా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలాంటివి గెలిచింది. చివరిసారి 2013లో ధోనీ కెప్టెన్సీలోనే ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచీ మరో ఐసీసీ ట్రోఫీ దక్కలేదు. ధోనీ 2020, ఆగస్ట్ 15న ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.