Gambhir on Arshdeep: అలా అయితే అంతర్జాతీయ మ్యాచ్ ఆడకు.. అర్ష్‌దీప్‌పై గంభీర్ సీరియస్
06 January 2023, 13:27 IST
- Gambhir on Arshdeep: అలా అయితే అంతర్జాతీయ మ్యాచ్ ఆడకు అంటూ అర్ష్‌దీప్‌పై గంభీర్ సీరియస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అతడు వరుసగా మూడు నోబాల్స్ వేసి విమర్శల పాలవుతున్నాడు.
గౌతమ్ గంభీర్, అర్ష్‌దీప్ సింగ్
Gambhir on Arshdeep: క్రికెట్‌లో ఓ హీరో జీరో అవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు పేస్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పరిస్థితి అలాగే ఉంది. కొన్నాళ్ల కిందటి వరకూ ఇండియన్ టీమ్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా ఎదుగుతూ వచ్చిన అతడు.. శ్రీలంకతో రెండో టీ20లో తన బౌలింగ్ తీరుతో విలన్‌లా మారిపోయాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లలో ఏకంగా 37 రన్స్ ఇచ్చాడు.
అదీ కాకుండా వరుసగా మూడు నోబాల్స్ వేయడం, వాటిలో ఒక బౌండరీ, ఒక సిక్స్ రావడంతో తీవ్రంగా విమర్శల పాలవుతున్నాడు. మరో ఓవర్లో కీలకమైన సమయంలో శనక వికెట్ తీసినా.. అదీ నోబాల్‌గా తేలింది. దీంతో అతనిపై విమర్శల దాడి మరింత తీవ్రమైంది. తాజాగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అయితే ఇలా గాయపడి చాలా రోజుల తర్వాత మళ్లీ వచ్చే వాళ్లు నేరుగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడొద్దని స్పష్టం చేస్తున్నాడు. కనీసం రిథమ్ సరిగ్గా లేకుండా ఎలా ఆడతారంటూ ప్రశ్నించాడు. మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ డిస్కషన్‌లో గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.
"ఏడు బాల్స్ అంటే ఊహించండి. అంటే 21 ఓవర్ల కంటే ఎక్కువ వేసినట్లు. ప్రతి ఒక్కరూ చెత్త బాల్స్ వేస్తారు లేదా చెత్త షాట్లు ఆడతారు. కానీ ఇది రిథమ్‌కు సంబంధించిన విషయం. గాయం నుంచి కోలుకొని తిరిగి వస్తుంటే నేరుగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడొద్దు" అని గంభీర్ స్పష్టం చేశాడు.
"నోబాల్స్‌ను అంగీకరించే ప్రసక్తే లేదు. అందుకే ముందు డొమెస్టిక్ క్రికెట్‌లోకి వెళ్లి పోయిన రిథమ్‌ను తిరిగి సంపాదించాలి. ఎవరు గాయపడి టీమ్‌కు చాలా కాలం పాటు దూరమైనా సరే ముందు డొమెస్టిక్ క్రికెట్‌కు వెళ్లాలి. కనీసం 15-20 ఓవర్లు వేయాలి. తర్వాతే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలి. అర్ష్‌దీప్ తన రిథమ్ కోల్పోయి తడబడుతున్నట్లు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది" అని గంభీర్ అన్నాడు.
గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన అతడు.. తర్వాత గాయం కారణంగా బంగ్లాదేశ్ టూర్‌కు దూరమయ్యాడు. శ్రీలంకతో తొలి టీ20కి కూడా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఆడలేకపోయాడు. రెండో మ్యాచ్‌కు హర్షల్ పటేల్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన అతడు.. 5 నోబాల్స్ వేశాడు. అందులో హ్యాట్రిక్ నోబాల్స్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓ బౌలర్ నోబాల్ వేయకపోవడం కచ్చితంగా అతని నియంత్రణలోనే ఉంటుందని మాజీ క్రికెటర్ గవాస్కర్ కూడా అర్ష్‌దీప్‌ను ఉద్దేశించి అన్నాడు.