Gambhir on IPL vs World Cup: ఐపీఎల్ కాదు వరల్డ్‌కప్ ముఖ్యం.. ఫ్రాంఛైజీలు నష్టపోతే పోనీ: గంభీర్
Gambhir on IPL vs World Cup: ఐపీఎల్ కాదు వరల్డ్‌కప్ ముఖ్యం అని, ఫ్రాంఛైజీలు నష్టపోతే పోనీ అని అన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన గౌతీ.. ఇండియన్ టీమ్‌కు కీలకమైన సూచనలు చేశాడు.
Gambhir on IPL vs World Cup: వన్డే వరల్డ్‌కప్ ఏడాది కావడంతో ప్రతి ఒక్కరూ దానిపై మాట్లాడుతున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం, గత రెండు వన్డే వరల్డ్‌కప్‌లలోనూ నిరాశే ఎదురైన నేపథ్యంలో ఈసారి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాల్సిన అవసరంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయం చెప్పాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ప్లేయర్స్‌కు విశ్రాంతి ఇవ్వాలంటే టీ20ల్లో ఇవ్వాలని, వన్డేలు మాత్రం కచ్చితంగా ఆడాలని స్పష్టం చేశాడు.
"మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్స్ బ్రేక్ కావాలనుకుంటే టీ20 క్రికెట్ నుంచి తీసుకోండి. కచ్చితంగా వన్డేల నుంచి మాత్రం కాదు. వాళ్లంతా టీమ్‌గా కొనసాగాల్సిందే. గత రెండు వరల్డ్‌కప్‌లలో చేసిన తప్పు ఇదే. టీమ్‌లోని సభ్యులు ఎక్కువ భాగం కలిసి ఆడలేదు. సరైన ప్లేయింగ్ 11తో బరిలోకి దిగిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి? వరల్డ్‌కప్‌లో ఆడే సందర్భంలోనే బెస్ట్ 11 ఇది అని చెబుతాం. కానీ అది బెస్ట్ 11 కాదు. టీ20ల నుంచి బ్రేక్ తీసుకుంటారా లేక ఐపీఎల్ నుంచా అన్నది వాళ్లిష్టం. కానీ వన్డే క్రికెట్ మాత్రం ఆడాల్సిందే" అని గౌతీ స్పష్టం చేశాడు.
ఐపీఎల్‌లో మ్యాచ్‌లకు దూరమైనా సరే.. ప్లేయర్స్ నేషనల్ టీమ్‌కు ఆడేలా బీసీసీఐ చూడాలని కూడా గంభీర్ తేల్చి చెప్పాడు. "ఫ్రాంఛైజీలు నష్టపోవాల్సి వస్తే పోనీ. ఇండియన్ క్రికెటే ముఖ్యం. ఐపీఎల్ కాదు. ఇండియా వరల్డ్‌కప్ గెలిస్తే అది పెద్ద ఘనత అవుతుంది. ఉదాహరణకు ఎవరైనా ముఖ్యమైన ప్లేయర్ ఐపీఎల్‌కు దూరం కావాల్సి వస్తే కానీ.. నష్టమేమీ లేదు. ఎందుకంటే ఐపీఎల్ ప్రతి ఏటా జరుగుతుంది. వరల్డ్‌కప్ మాత్రం నాలుగేళ్లకోసారి జరుగుతంది. నా వరకూ ఐపీఎల్ గెలవడం కంటే వరల్డ్‌కప్ గెలవడం చాలా ముఖ్యం" అని గంభీర్ స్పష్టం చేశాడు.
రానున్న వరల్డ్‌కప్‌లో స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడగలిగిన వాళ్లు, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి ప్లేయర్స్ ప్రముఖ పాత్ర పోషించనున్నారని గంభీర్ అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్‌కు తగినట్లుగా, భయం లేకుండా ఆడే ప్లేయర్స్‌ను గుర్తించాలని చెప్పాడు. ప్లేయర్స్‌ను గుర్తించడంతోపాటు సరైన కాంబినేషన్ కూడా ముఖ్యమని అన్నాడు.