Gavaskar on Arshdeep no balls: ప్రొఫెషనల్స్ ఇలా చేయరు.. అర్ష్‌దీప్ నోబాల్స్‌పై గవాస్కర్ సీరియస్
Gavaskar on Arshdeep no balls: ప్రొఫెషనల్స్ ఇలా చేయరు అంటూ అర్ష్‌దీప్ నోబాల్స్‌పై గవాస్కర్ సీరియస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అర్ష్‌దీప్ వరుసగా మూడు నోబాల్స్ వేసి ఓ చెత్త రికార్డును తన పేరిట రాసుకున్న విషయం తెలిసిందే.
Gavaskar on Arshdeep no balls: శ్రీలంకతో టీ20 సిరీస్‌ను టీమిండియా పుణెలోనే సొంతం చేసుకుంటుందని ఆశించిన ఫ్యాన్స్‌ను నిరాశే ఎదురైంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లలో విఫలమైన టీమ్.. 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అక్షర్ పటేల్ మరోసారి ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.
అయితే మొదట బౌలింగ్‌లో ఇండియన్ టీమ్ భారీగా పరుగులు సమర్పించుకుంది. దీనికితోడు వరుస నోబాల్స్ అటు కెప్టెన్ హార్దిక్‌ను ఇటు ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ వరుసగా మూడు నోబాల్స్ వేయడం షాక్‌కు గురి చేసింది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్‌లో ఏ ఇతర ఇండియన్ బౌలర్ వరుసగా మూడు నోబాల్స్ వేయలేదు.
నోబాల్ వేయడం ఓ క్రైమ్ అంటూ దీనిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అసంతృప్తి వ్యక్తం చేయగా.. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా అర్ష్‌దీప్, శివమ్ మావి నోబాల్స్‌పై సీరియస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కామెంట్రీ చేసిన సన్నీ.. ఆ సమయంలోనే తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ ఘాటుగా స్పందించాడు.
"ఓ ప్రొఫెషనల్‌గా మీరు ఇలా చేయకూడదు. ఈ మధ్య కాలంలో ప్లేయర్స్ తరచూ పరిస్థితులు తమ నియంత్రణలో లేవని చెప్పడం వింటూ ఉన్నాం. కానీ నోబాల్ వేయకపోవడం అన్నది మీ నియంత్రణలోనే ఉంటుంది. మీరు బాల్ వేసిన తర్వాత ఏం జరుగుతుంది, బ్యాట్స్‌మన్ ఏం చేస్తాడన్నది వేరే విషయం. కానీ నోబాల్ వేయకపోవడం కచ్చితంగా మీ నియంత్రణలోనే ఉంటుంది" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
టీ20ల్లో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన తొలి ఇండియన్ బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్న అర్ష్‌దీప్.. తాను వేసిన తొలి ఓవర్లోనే 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో శ్రీలంక భారీ స్కోరుకు బాటలు వేసినట్లయింది. ఈ మ్యాచ్‌లో 206 రన్స్ చేసిన శ్రీలంక.. తర్వాత ఇండియాను 190 రన్స్ స్కోరుకు కట్టడి చేసింది.
సంబంధిత కథనం